అరకు ఎమ్మెల్యే కిడారు ఈశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి మావోయిస్టులకు చెందిన ఒక దళం నుంచిగానీ, కేంద్ర కమిటీ నుంచిగానీ ఎలాంటి స్పందనా రాలేదు. దీంతోపాటు, ఈ జంటల హత్యలకు సంబంధించి రకరకాల కథనాలు బయటకి వస్తూనే ఉన్నాయి. వారి వాహనాల్లో డబ్బులున్నాయంటూ ఓ కథనం తాజాగా చక్కర్లు కొట్టింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అధికారంగా వెల్లడి కావాల్సి ఉంది.
రాష్ట్రంలో లేదనుకున్న మావోయిస్టుల బెడద ఈ ఘటనతో అనూహ్యంగా మరోసారి తెరమీదికి వచ్చిందనే చెప్పాలి. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మరోసారి తమ ఉనికిని చాటుకున్నారనీ అనొచ్చు. అవసరం అనుకుంటే చత్తీస్ గఢ్ వంటి ప్రాంతాల నుంచి దళాలను రప్పించుకుంటూ, ఈ ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ప్రజా ప్రతినిధులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఏర్పడినట్టయింది. ఏవోబీ ప్రాంతంలో దాదాపు వంద గిరిజన తండాలు ఇప్పుడు పూర్తిగా మావోయిస్టుల ఆధిపత్యంలో ఉన్నాయనీ, ఆయా ప్రాంతాల్లోకి పోలీసులు వెళ్లే పరిస్థితి కూడా లేదనే సమాచారం కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది. అంతేకాదు, ఇటీవలి కాలంలో దాదాపు మూడు వందల మంది గిరిజన యువతను మావోయిస్టులు రిక్రూట్ చేసుకున్నట్టు కూడా సమాచారం ఉందని తెలుస్తోంది. దీంతో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మావోయిస్టులు మరింత బలపడుతున్నారనే సంకేతాలు వ్యక్తమౌతున్నాయి. దాన్ని చాటి చెప్పేందుకే తాజా దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలూ ఉన్నాయి.
కిడారు హత్యానంతరం ఇతర నేతలు కూడా వారి హిట్ లిస్టులో ఉండే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా నుంచి ఇటీవలే టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పోలీసులు భద్రత పెంచారు. అయితే, తాను మావోయిస్టుల హిట్ లిస్టులో లేననీ, అసాధారణమైన భద్రత అవసరం లేదని ఆమె స్పందించారు. కానీ, పోలీసులు అధికారుల ఆమె భద్రత విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మావోయిస్టుల హిట్ లిస్టులో ఇంకా కొంతమంది ఉన్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో, పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల పర్యటనలూ, రాజకీయ పార్టీల కార్యకలాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి… ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా నేతలు వ్యవహరించాలని, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని పోలీసులు చెబుతున్నారు.