రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతీనెలా వెయ్యి రూపాయలు అందించే కార్యక్రమానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. గాంధీ జయంతి సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈనెల 3న తొలి దశగా అర్హులైన నిరుద్యోగుల అకౌంట్లలో సొమ్ము జమ చేయనున్నారు. ఈ గత ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇది. దీని అమలుపై ఒక కమిటీని ఏర్పాటు చేసి, వివిధ రాష్ట్రాల్లో అమలు తీరును సమీక్షించారు. అయితే, దీన్ని ఆరంభ శూరత్వంగా ప్రారంభించి, కొన్నాళ్లకు పక్కన పడేయడం అనే విధంగా కాకుండా… ఇదొక నిరంతర ప్రక్రియగా భృతి అనేది కొనసాగుతూనే ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఫలానా తేదీలోపు మాత్రమే నిరుద్యోగులు భృతి కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనేమీ లేదు. ఎవరైనా ఎప్పుడైనా చేసుకునే వీలు కల్పించారు.
నిజానికి, నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి భృతి అనేది ఒక్కటే పరిష్కార మార్గం కాదు. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం లాంటిది మాత్రమే. అందుకే, ఈ భృతితోపాటు నిరుద్యోగ నైపుణ్యాల శిక్షణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి యువత నేస్తం కార్యక్రమం ద్వారా నిరుద్యోగుల వివరాలను, వారి విద్యార్హత, వృత్తి నైపుణ్యాల వంటి సమాచారాన్ని సేకరిస్తారు. వీరు ఎలాంటి ఉద్యోగాలకు ఉపయోగపడతారు అనే సమాచారాన్నంతా ఒక యాప్ ద్వారా అప్ లోడ్ చేస్తారు. ఇప్పటివరకూ నమోదైన 2 లక్షల 10 వేలమందికి శిక్షణ తరగతులు ఇస్తారు. అంతేకాదు, ఆ శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఏపీ ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ పత్రం కూడా ఇస్తారు. ఈ వివరాలను యాప్ లో అప్ లోడ్ చేస్తారు. అంటే, దేశవ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచైనా, ఏ కంపెనీలైనా ఈ యాప్ ద్వారా వారికి కావల్సిన సిబ్బందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఫలానా వ్యక్తి ఫలానా నైపుణ్యం ఉన్నవాడని ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇస్తుంది కాబట్టి… ఆయా సంస్థల నియామకాల ప్రక్రియలో వారికి కచ్చితంగా ప్రాధాన్యత దక్కుతుంది.
కేవలం నెలకి తలా ఓ వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, నిరుద్యోగిగా నమోదైన యువతీ యువకులకు ఉద్యోగాలు లభించే దిశగా నడిపించే కార్యక్రమం కూడా దీన్ని రూపొందించారు. కాబట్టి, ఇదేదో ఎన్నికల ముందు జనాకర్షణ కోసం ఆదరాబాదరాగా అమల్లోకి తీసుకొచ్చిన పథకం అని అంత సులువుగా విమర్శించగలిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇక, ప్రతిపక్ష పార్టీలు ఇలానే విమర్శించినా కూడా… ఈ పథకం అందుకునే ప్రతీ నిరుద్యోగ యువతకీ దీని లాభం ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమౌతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.