అమరావతి ప్రాంతం రైతుల నిరసనల్ని, అసంతృప్తిని “ప్రోపర్ గా హాండిల్ చేయలేకపోయినందుకు” రాష్ట్రవ్యవసాయ శాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ”ఇలా అయితే ఎలా” అని తీవ్రంగా మందలించారని తెలిసింది. కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెంనాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లను కూడా సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గట్టిగా మందలించారని చెబుతున్నారు.
తాను అనుకున్న పని అనుకున్న పద్ధతిలో మౌనంగా పూర్తి చేసుకోవడమే తప్ప నాయకుడిగా ప్రభుత్వాన్ని నడిపించడంలో, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించడంలో కటువుగా వుండటమో, కనీసం కాఠిన్యాన్ని చూపించడం కూడా చంద్రబాబు రాదన్న విశ్లేషణా, విమర్శా కూడా ఆయన మీద సొంత పార్టీలోనే వున్నాయి.”మీ పద్ధతి మార్చుకోకపోతే ఊరుకునేది లేదు” అనేదే చంద్రబాబు వెలిబుచ్చే ఆగ్రహం. ఈ కొద్దిపాటి ఆగ్రహం కూడా మిమిక్రీ కళాకారుల ప్రదర్శనల వల్ల ఒక జోకైపోయింది.
రాష్ట్రాన్ని పట్టుకున్న ఆర్ధిక సమస్యలు, కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందకపోవడం, ప్రపంచాన్ని ఆవరించిన ఆర్ధిక మాంధ్యం వల్ల ప్రాజెక్టులు సకాలంలో గ్రౌండ్ అవ్వకపోవడం, హైదరాబాద్ ఎన్నికల్లో పూర్తిస్ధాయిలో పనిచేయగల పరిస్ధితులు లేకపోవడం వగైరా వగైరా కారణాల వల్లో ఏమో చంద్రబాబు తన స్వాభావికమైన సహనాన్ని కోల్పోతున్నారని ఒక మంత్రికి అత్యంత సన్నిహితుడైన ఒక ప్రొఫెషనల్ వివరించారు. అదేమీ కాదు చంద్రబాబు మెతకతనాన్ని వొదిలేసు కుంటున్నారని ఒక సీనియర్ ఎమ్మెల్లే అభిప్రాయ పడ్డారు.
ఏ పర్యటననైనా, ఏ విశేషాన్నైనా అదే మొదటి సారన్నంత ఎగ్జైట్ మెంటుతో సుదీర్ఘంగా వివరించే చంద్రబాబు ”దావోస్” సమావేశం వివరాలు చెప్పే టైముని బాగా కుదించుకున్నారు. ఇది పెద్ద మార్పే!
ఈ నేపధ్యంలో నిన్నటి కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ముగ్గురు సహచరులకు తలంటేశారు. విశ్వసనీయమైన సమాచారం ప్రకారం…సంక్రాంతి సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో చోటుచేసుకున్నలోపాలను కార్మిక మంత్రి అచ్చన్నాయుడు మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు. పరోక్షంగా ఇది పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను వేలెత్తిచూపుతూ, ఆమెపై ఫిర్యాదు చేసినట్టు అయ్యింది. దీంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చి ముందుగా మీ శాఖను సక్రమంగా నిర్వహించాలంటూ అచ్చెన్నాయుడుకు చురకలు అంటించారు. చంద్రన్న సంక్రాతి కానుకలో నాసిరకం సరకులు పంపిణీ చేశారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై చంద్రబాబు ఇంతకు ముందే జిల్లా కలెక్టర్లు, మంత్రులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన సరకులు అందించాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడలేదు. విజయనగరం జిల్లాలో కూడా చంద్రన్న కానుకలను ప్రజలకు చేర్చలేకపోవడంతో ఈసారి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని….అధికారులు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరావులకు కూడా చంద్రబాబునాయుడు అక్షింతలు వేసినట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలను మంత్రులు పట్టించుకోవడంలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని రైతులు ప్రతి రోజు రోడ్డెక్కుతూ ఆందోళనకు దిగుతున్నా వారి సమాధాన పరిచే ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని సీఎం తప్పుపట్టునట్టు సమాచారం. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నా పట్టించుకోరా… అంటూ బాబు నిలదీయడంతో.. సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలినట్టు మంత్రులే చెప్పుకుంటున్నారు.