పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెతను ఫాలో అవుతున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన పార్టీ.. కనీసం అడ్రస్‌ను అయినా గుర్తించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో శ్రీకాకుళం నుంచి పీసీసీ చీఫ్ రఘువీరా యాత్ర ప్రారంభించారు. పోలాకి మండల కేంద్రం పార్టీ జెండాను ఆవిష్కరించి.. కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో ఉందని.. కాపాడాలని ఇంటింటికి వెళ్లి వేడుకోవడం ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతుందనే విషయాలను కరపత్రాల ద్వారా ప్రజలకు చెబుతున్నారు.
నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో పర్యటించిన రఘువీరారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రధాన ప్రతిపక్షం కూడా విఫలమయిందని ప్రజలకు చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ, వైసీపీకు ఓటు వేస్తే అభివృద్ధి నిరోధకులకు ఓటు వేసినట్టేనని వాదిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరంతో పాటు విభజన హామీలన్నీ అమలయ్యేవని జోస్యం చెబుతున్నారు. మరి పోలవరం 70 ఏళ్ల నుంచి అలాగే ఉంది.. అందులో అరవై ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది.. ఎందుకు ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని.. ఎవరికైనా సందేహం వస్తే మాత్రం..సమాధానం చెప్పడానికి రఘువీరా సిద్ధంగా ఉండరు.
ప్రత్యేకహోదా విషయాన్ని ఆయన ప్రజల్లో తమకు అనుకూలంగాచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాయకులు పార్టీ వీడినప్పటికీ క్యాడర్ మాత్రం పార్టీతోనే ఉందని రఘువీరా రొటీన్ డైలాగులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. కానీ క్యాడరే లేక.. కిరాయి కార్యకర్తలతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.