తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పీట ముడి పడుతోంది. ఎప్పటికప్పుడు నేత తాకిడిని తప్పించుకోవడానికి సర్వేల పేర్లు చెబుతున్నా.. పార్టీని అంటి పెట్టుకుని ఉన్న సీనియర్లు మాత్రం..తమ తమ వర్గాలకు .. టిక్కెట్లు ఖరారు చేయించుకునేందుకు తీవ్ర స్థాయిలో హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనవేసేందుకు ప్రత్యేకంగా ఓ టీంను హైదరాబాద్ పంపారు. ఓ వైపు మహాకూటమి పక్షాలతో సీట్ల సర్దుబాటుకోసం చర్చలు జరుపుతూనే మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది. అందులో భాగంగా టీ కాంగ్రెస్ ముందుగా నియోజక వర్గాల వారిగా ఆశావహుల నుంచి దరఖాస్తులను సేకరించారు. అటు పార్టీ పరిస్థితి, ఆశావహుల బలాబలాల పై రాష్ట్ర కాంగ్రెస్ సర్వే నిర్వహించింది. అందులో మొదటి రెండు స్థానాల్లో ఉన్నవారి జాబితాను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పార్టీ పంపిన జాబితా ఆధారంగా హైకమాండ్ కూడా ప్రత్యేకంగా సర్వే జరిపిస్తోంది. ఒడిశా నుంచి వచ్చిన రాహుల్ దూతలు 15 టీం లుగా విడిపోయి తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. నియోజక వర్గాల వారిగా ఆశావహుల బలాబలాల మీద వారు సర్వే రిపోర్టులను అధిష్టానానికి అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ కి తెలియకుండానే అత్యంత రహస్యంగా రాహుల్ దూతలు సర్వేను పూర్తి చేసిట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకోసమే కాకుండా మహా కూటమి పక్షాల పరిస్థితి పై కూడా వారు సర్వేలు నిర్వహించారట. నేరుగా క్షేత్ర స్తాయిలోకి వెళ్లి రిపోర్టులు తయారు చేస్తున్నారట. వీటి ఆధారంగానే అటు పొత్తులు, ఇటు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ.. పూర్తిగా సీనియర్ల మీద ఆధారపడకుండా… ఎవరో చెప్పేది గుడ్డిగా వినకుండా.. తన కుండా.. ఓ ఎన్నికల టీమ్‌ను ఏర్పాటు చేసుకుని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.అదే నిజం అయితే.. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లకు టిక్కెట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. యువతకు ఎక్కువ అవకాశాలు వస్తాయని అంటున్నారు. మరి టిక్కెట్లు ఖరారయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మరి..!