జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్న తాపత్రయంతో… మాట్లాడుతున్న అంశాలపై కంట్రోల్ తప్పిపోతున్నారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో …. పోరాటయాత్రలో ప్రసంగించిన పవన్ కల్యాణ్.. చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూపాయికి కిలో బియ్యం .. సారా కాచుకోటానికి , మొలాసిస్ తయారీకి పనికొస్తాయని తేల్చేశారు. బియ్యం ఒక్కటి ఇస్తే సరిపోతుందా..? పప్పు , కారం, నూనె కూరగాయలు ఎక్కడినుంచి తెచ్ఛుకుంటారని ప్రశ్నించారు. అందుకే రేషన్ కు బదులు ప్రతీ కుటుంబానికి రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చామని తన వాదనను సమర్థించుకున్నారు. రూ. 2500 ఇవ్వొచ్చులే కానీ.. రూపాయి బియ్యంతో సారా, మెలాసిస్ తయారు చేస్తారని.. పవన్ కు ఎవరు చెప్పారో మరి..? ఏ పుస్తకంలో చదివారో మరి..?
ఇన్ని సంవత్సరాలు అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెంల్లో ఒక్క పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయలేకపోయారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఆపద సమయంలో జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు ఆసుపత్రికి వెళ్ళాలంటే కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడంపై బాధపడ్డారు. జంగారెడ్డి గూడెం టౌన్ హాల్ ని పేకాట క్లబ్బుగా మార్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని మండి పడ్డారు. నిజానికి టౌన్ హాల్ ప్రైవేటు వ్యక్తులది. అందులో పేకాట జరుగుతోందని.. ఎవరు చెప్పారో కానీ పవన్ ఆవేశ పడ్డారు. జంగారెడ్డి గూడెంలోనూ… చింతమనేని తలుచుకున్నారు పవన్. అక్కడ 42 ఎకరాలను చింతమనేని కబ్జా చేశారని ఆరోపించారు.
అమరావతి రాజధాని రైతులకు బాండ్లు ఇచ్చినట్లే పోలవరం నిర్వాసితులకు కూడా బాండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పామాయిల్, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే.. మేనిఫెస్టోలో పెడతామన్నారు. రాష్ట్రంలో సుమారు 19వేల జనసేన పార్టీకి చెందిన ఓట్లను ప్రభుత్వం తొలగించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గానికి పాతిక కోట్లు ఖర్చుపెట్టేందుకు టీడీపీ సిద్ధమైందని జోస్యం చెప్పారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన టీడీపీని అధికారంలోకి రానివ్వబోమని చాలెంజ్ చేశారు. చివరిలో జనసేన విజయం సాధించే తొలి అసెంబ్లీ నియోజకవర్గం చింతలపూడి అవుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో పాయకరావు పేటలోనూ అదే అన్నారు. ఇంతకూ జనసేన మొదట గెలిచేది.. పాయకరావు పేటనా..? చింతల పూడినా..?