పదవీ వ్యామోహం గురించి నేటి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారంటేనే అదోలా ఉంటుంది…! ఇక, ఒక పార్టీ టిక్కెట్ మీద గెలిచి, ఆ పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి జంప్ చేసిన నాయకులు ఇదే టాపిక్ మీద మాట్లాడుతుంటే ఇంకోలా ఉంటుంది..! కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వచ్చి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలకు పదవుల మీదే ధ్యాస ఎక్కువ అన్నారు! కాంగ్రెస్ వేస్తున్న రాజకీయ కుయుక్తులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారనీ, ఈ ఎన్నికల్లో మరోసారి ఆ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి సీటు కోసం కుస్తీ ఎప్పుడో మొదలైపోయిందనీ, కనీసం అభ్యర్థులను ప్రకటించకుండానే వారు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలనే నిర్ణయంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. ‘కాంగ్రెస్ నేతలకు ప్రజల కంటే పదవులపైనే ప్రేమ ఎక్కువ’ అన్నారు గుత్తా.
సాంకేతికంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇంకా కాంగ్రెస్ నాయకులే కదా! ఎందుకంటే, ఆయన ఎంపీ పదవికి రాజీనామా చెయ్యలేదు. ఇంకోటి… కాంగ్రెస్ నేతలకు పదవీ వ్యామోహం ఎక్కువ అని చెప్పడం ద్వారా, తన ఆకాంక్షను కూడా పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా! ఆ కాంక్ష ఉంది కాబట్టే తెరాసలోకి వచ్చారు. వాస్తవానికి, గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిందే… తెరాసలో పదవి వస్తుందన్న ఆశతోనే అనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ భరోసా ఇవ్వడంతోనే ఆయన తెరాసలో చేరిపోయారు. అయితే, సాంకేతికంగా ఆయన ఎంపీగానే కొనసాగేలా మొదట్లో చాలా జాగ్రత్తలుపడ్డారు. అధికారికంగా తెరాసలో చేరినట్టు ఎక్కడా మాట్లాడకుండా, ఎంపీ పదవికి రాజీనామా చెయ్యకుండా, పార్లమెంటు సమావేశాలకు కాంగ్రెస్ నేతగా హాజరు కాకుండా… కొన్నాళ్లపాటు బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు.
తెరాస నుంచి మంత్రి పదవి ఆశించినా… ఆయనకు ఆ అవకాశం దక్కకుండానే పదవీ కాలమంతా కరిగిపోయింది. చిట్ట చివరికి గుత్తాకి రైతు సమితి అధ్యక్ష పదవి ఇచ్చారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా అనే అంశాన్ని మెల్లగా పక్కన పెట్టేశారు. అంతేకాదు, కొన్ని నెలల కిందటే… గుత్తాతో రాజీనామా చేయించి, నల్గొండ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికకు వెళ్లి, తెరాసను గెలిపించడం ద్వారా రాష్ట్రంలో ప్రజల మూడ్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నమూ జరిగిందన్న కథనాలు వచ్చాయి. అయినా ఎన్నికలకు వెళ్లలేదు. ఇదంతా ఉన్న ఎంపీ పదవిని వదులుకోకూడదు అనే వ్యామోహంలో భాగమే అవుతుంది కదా. ఏదైతేనేం, గుత్తా కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లింది పదవికోసం అనే బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలాంటప్పుడు, ఆయనే పదవీ వ్యామోహం గురించి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే… వినేవాళ్లకి కొంచెం కామెడీగా ఉంది.