దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ వ్యక్తిగతంగా తమపై దాడి చేస్తున్నారని… తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐటీ అధికారుల విచారణకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇతర నిందితులతో కలిసి ఐదున్నర గంటల పాటు రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల ఇరవై మూడో తేదీన మరోసారి విచారణకు హాజరుకావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేవంత్ సమాధానాలను ఐటీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణకు ఉదయసింహా, రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఐటీ అధికారుల అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. ఐటీ అధికారుల ముసుగులో తమ ఇళ్లపై కేసీఆర్ ప్రైవేట్ సైన్యం దాడులు చేస్తోందని… రేవంత్ రెడ్డి ఆరోపించారు. త్వరలో డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు స్పందించకపోతే.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటానన్నారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయాలకు వాడుకుంటున్నారని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. సరైన సమాధానాలు ఇచ్చాను కాబట్టే బయటకు వచ్చానన్నారు. ఇలాంటి కేసుల వల్ల కేసీఆర్ ఎన్నికల్లో గెలువరని స్పష్టం చేశారు. రణధీర్ ఇంటిపై దాడి గురించి హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. తనకు ఎలాంటి అక్రమ కంపెనీలు లేవని స్ఫష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ఐటీ విచారణ.. ఉత్కంఠ రేపింది. పూర్తిగా ఓటుకు నోటు కేసులోనే అధికారులు సోదాలు, విచారణ చేస్తున్నారని తెలియడంతో.. ఆ రూ. 50 లక్షల గుట్టు తెలుసుకునేందుకు కస్టడీలోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారంతో పెద్ద సంఖ్యలో.. రేవంత్ అనుచరులు.. ఆయాకార్ భవన్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకూ అక్కడ ఉత్కంఠ కొనసాగింది. రేవంత్ బయటకు రావడంతో ఉత్కంఠకు తెరపడింది. మరోసారి ఇరవై మూడో తేదీన విచారణ జరగనుంది.