మహా కూటమిలో కీలక పార్టీల నేతలు మరోసారి సమావేశం అయ్యారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, సాంబశివరావు, దిలీప్ కుమార్, రావుల చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. అంశాలవారీగా ఈ సమావేశంలో పార్టీల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం మీడియాతో మాట్లాడిన టీజేఎస్ దిలీప్… ఉమ్మడి ప్రణాళికకు సంబంధించి డ్రాఫ్ట్ సిద్ధం చేశామని చెప్పారు. దీన్లో నీళ్లు, నిధులు, నియామకాలకే ప్రాధాన్యత కల్పించామన్నారు. మహాకూటమి అధికారంలోకి రాగానే ఏడాదిలోపుగా లక్ష ఉద్యోగాల భర్తీ, ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతిపై సమగ్ర విచారణ… వీటిని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రధానాంశాలుగా పేర్కొంటామని చెప్పారు.
మహా కూటమిలోని నాలుగు ప్రధాన పార్టీలూ విడివిడిగా మేనిఫెస్టోలు తయారు చేసుకుని వచ్చారు. అనంతరం వాటన్నింటినీ క్రోడీకరించి ఉమ్మడి ప్రణాళిక తయారు చేయాలని నిర్ణయించారు. నాలుగు పార్టీలూ వారి మేనిఫెస్టోలను ఇతర పార్టీలతో పరస్పరం పంచుకున్నారు. ఈ సమావేశంలో సిద్ధం చేసిన ముసాయిదాని పార్టీల అధ్యక్షులకు పంపుతామని సీపీఐ నేత సాంబశివరావు చెప్పారు. మహా కూటమికి ప్రత్యామ్నాయంగా రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’ పేరును పెట్టే అవకాశం ఉందనీ తెలుస్తోంది. ఇక, ఇప్పటికే తెరాస ప్రచార హోరును పెంచుతున్న నేపథ్యంలో మరింత వేగంతో తాము కూడా ప్రచారం చేయబోతున్నామని భట్టి విక్రమార్క అన్నారు. గురువారం నుంచే కాంగ్రెస్ ప్రచారం ప్రారంభిస్తోందన్నారు. అయితే, ఇంకోపక్క మహా కూటమి సమావేశాలు జరుగుతూనే ఉంటాయనీ, వ్యూహమంతా వీలైనంత త్వరగా ఖరారు చేసి, ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకుని కూటమి పార్టీలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటామని నేతలు చెబుతున్నారు.
ఇక, మహాకూటమిలో కీలకమైన సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలీక్కి రావడానికి కూడా కొంత సమయం పట్టేలానే కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాతనే ఈ చర్చ ఉంటుందని నేతలు అంటున్నారు. మొత్తానికి, మహా కూటమి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు, ప్రచార వ్యూహం, అజెండా… ఇలా అన్నీ పూర్తి కావాలంటే మరోవారం రోజులు పడుతుందనే అనిపిస్తోంది. ఈలోగా మరో రెండు, లేదా మూడుసార్లు కూటమి పార్టీల మధ్య సమావేశాలు ఉండే అవకాశం ఉందని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు.