ప్రతిపక్ష పార్టీలన్నీ తెరాస సర్కారుపై చేసే విమర్శల్లో ప్రధానమైంది… కేసీఆర్ కుటుంబ పాలన! తెలంగాణ వచ్చాక ఆ కుటుంబంలో నలుగురికీ మేలు జరిగిందే తప్ప, సామాన్యులకు ఒరిగిందేదీ లేదనేది కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు చాలాసార్లు విమర్శలు చేస్తూ ఉంటాయి. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్దాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్న తరువాత కూడా రాజకీయంగా ముందుగా వారి కుటుంబ సభ్యులకే వరుస ప్రాధాన్యత ఇస్తున్న ఈ తీరుని ప్రతిపక్షాలు గమనించాయో లేదో..! అసెంబ్లీ రద్దు చేద్దామని కేసీఆర్ నిర్ణయించుకున్నాక.. ముందుగా మంత్రి కేటీఆర్ కి ప్రాధాన్యత ఇచ్చారు! ఆ తరువాత, మేనల్లుడూ మంత్రి హరీష్ రావుకి ప్రాధాన్యత దక్కింది! ఇప్పుడు, కుమార్తె, ఎంపీ కవితకు ప్రముఖ స్థానం కల్పించారు..!
హైదరాబాద్ లోని కొంగర కలాన్ సభ గుర్తుండే ఉంటుంది..! ప్రగతి నివేదన సభ నుంచే ముందస్తు ఎన్నికల వేడి తెలంగాణలో తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ సభకు నాయకత్వం వహించి ఏర్పాట్లు చేసిందెవరూ… కుమారుడు కేటీఆర్. ప్రగతి నివేదన సభ సమయంలో మంత్రి హరీష్ రావుకు ప్రాధాన్యత దక్కలేదన్న విమర్శలు వెంటనే గుప్పుమన్నాయి. అయితే, ఆ తరువాత హుస్నాబాద్ లో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. దీనికి నాయకత్వం వహించింది ఎవరు… కేసీఆర్ మేనల్లుడూ, మంత్రి హరీష్ రావు. తాజాగా నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభకు నాయకత్వం వహించిందెవరు… ముఖ్యమంత్రి కుమార్తె, ఎంపీ కవిత..!
దీన్ని రాజకీయంగా తెరాసలో వారసత్వ ప్రాధాన్యత క్రమం అని వ్యాఖ్యానించలేంగానీ… కుటుంబంలోని ఉన్నవారికి వరుసగా కీలక ఎన్నికల సభల్లో ప్రముఖ పాత్రను కేసీఆర్ ఇవ్వడం గమనార్హం! అయితే, ఈ ముగ్గురూ ఈ మూడు సభల్నీ విజయవంతం చేశారనడంలోనూ సందేహం లేదు. భారీ ఎత్తున జన సమీకరణలో సక్సెస్ అయ్యారు. కుటుంబ పాలన అని విమర్శలు ఎదుర్కొంటున్నా కూడా… ఇలా వరుసగా తనవారికే కేసీఆర్ ప్రాధాన్యత కల్పించడం విపక్షాలకు ఒక విమర్శనాస్త్రంగా మారే అవకాశం ఉందనే చెప్పాలి.