తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత అంత తీవ్రమైన అసంతృప్తేమీ మొదట్లో కనిపించలేదు. లోలోన రగిలిపోయారు. కానీ రాను.. రాను.. అసంతృప్తులు పెరిగిపోతూ ఉన్నాయి. దావాలనం అంటుకున్నట్లు.. ఒక్కో నియోజకర్గానికి అంటూకుంటూ పోతున్నాయి. కొంత మంది నియోజకవర్గంలో పట్టు ఉన్న నేతలు కేసీఆర్ మనసు మార్చడానికి బలప్రదర్శన చేస్తున్నారు. ఏం చేసినా కేసీఆర్ మనసు మార్చుకోరని తెలిసిన వాళ్లు పార్టీ దూకేస్తున్నారు. అయితే ఇలా దూకుతున్న వాళ్లంతా… ఎక్కువగా కొత్తవాళ్లు.. కొంత మంది పాతవాళ్లు. వీరంతా హరీష్‌రావుతో వ్యవహారాలు నడిపిన వాళ్లే. అందరూ వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో టీఆర్ఎస్ ఏమంత బలంగా ఉండేది కాదు. కానీ తర్వాత కేసీఆర్ అధికార మంత్ర దండాన్ని వాడారు. హరీష్ రావు పూర్తిగా వ్యవహారాలు చక్క బెట్టారు. తెలుగుదేశం, కాంగ్రెస్ మాత్రమే కాదు.. లెఫ్ట్ పార్టీలనే తేడా చూపకుండా… బలహీన మనస్కులైన ప్రతి ఒక్కరిని ఆకర్షించారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్‌లో .. హరీష్‌రావుదే కీలక పాత్ర. నిధుల హామీలు కావొచ్చు… నియోజకవర్గ అభివృద్ధి పనులు కావొచ్చు.. వ్యక్తిగతంగా బెదిరింపులు, బుజ్జగింపులు కావొచ్చు.. అన్నీ హరీష్ రావే చూసేవారు. దాంతో సహజంగానే వారంతా.. హరీష్‌తో టచ్‌లో ఉండటం ప్రారంభించారు. ఇప్పుడు హరీష్‌రావుకే టీఆర్ఎస్లో ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదు. ఇక ఆయన పార్టీలో చేర్చిన వారికీ.. ముందు నుంచి ఆయన అనుచరులుగా ఉంటున్నవారికి ప్రాధాన్యం ఎక్కడ దక్కుతుంది.
అందుకే ఒక్కొక్కరుగా పార్టీ మారిపోతున్నారు. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దగ్గర్నుంచి.. పటాన్ చెరులోని సఫాన్ దేవ్ అనే నేత వరకూ హరీష్ పార్టీలో చేర్చిన అనేక మంది కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు. ఇందులో… ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ నేతలు కూడా ఉన్నారు. గజ్వేల్ పర్యటనకు వెళ్లిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న జగదేవపూర్ ఎంపీపీ రేణుక ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు, ఇద్దరు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక పటాన్ చెరు నియోజకవర్గంలో… టీఆర్ఎస్ అన్ని పార్టీల నేతలను కలిపేసుకుంది. వీరందర్నీ దగ్గరుండి హరీష్ రావే పార్టీలో చేర్పించారు. ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే తప్ప.. నియోజకవర్గంలో మెరుగైన స్థానాల్లో ఉన్న వారంతా.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. వీరిలో మొదటి నుంచి హరీష్ రావు అనుచరులుగా పేరు పడిన వాళ్లు కూడా ఉన్నారు. ముందు ముందు ఈ వలసలు మరింత పెరుగుతాయని.. టీఆర్ఎస్ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తమవుతోంది.