ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. నెల్లిమర్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… మరోసారి టీడీపీ సర్కారుపై విమర్శలు చేశారు. ప్రతీ ఇంటికీ ఉద్యోగం ఇస్తాననీ, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా అంటూ ప్రజలను అడిగారు! ఎన్నికల ముందు ఈ పెద్ద మనిషి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతీ ఇంటికీ చంద్రబాబు నాయుడు రూ. 1.08 లక్షలు బాకీ పడ్డారని చెప్పారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ పెద్ద మనిషి నిరుద్యోగ భృతి అంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారనీ, రెండు వేలు ఇస్తామని గతంలో చెప్పి, ఇప్పుడు వెయ్యి రూపాయలే చేతులో పెడుతున్నారనీ, ఒక్కొక్కరి పేరు మీదా ఏడాదికి రూ. 12 వేల చొప్పున దోచుకుంటున్నారనీ, శిక్షణ పేరుతో నిధులు కాజేస్తున్నారని జగన్ విమర్శించారు.
ఇంతకీ జగన్ చెబుతున్న ఈ లెక్కలేంటీ..? ఈ లెక్కల వెనక లాజిక్ ఏది..? ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఇలా కూడా ఆలోచిస్తారా.. అనే ఆశ్చర్యం ప్రజల నుంచే వ్యక్తమౌతోంది. నిరుద్యోగ భృతి హామీ గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిందే. దాని అమలుపై మంత్రులతో కమిటీలు వేసి, వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, ప్రభుత్వాలు మారినా సరే ఈ పథకం కింద నిరుద్యోగులకు అందాల్సిన సాయం నిరంతరాయంగా అందుతూ ఉండే విధంగా డిజైన్ చేశారు. అంతేకాదు, ఇంకోపక్క నిరుద్యోగులకు నైపుణ్యాల శిక్షణ ఇస్తున్నారు. 2014లో ఇచ్చిన హమీని నెరవేరుస్తున్నారు కదా! అయినాసరే, ఇంకా నెలకి రూ. వెయ్యి చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారని ప్రజలు అనుకుంటున్నారని జగన్ లెక్కలు చెప్పడం మరీ విడ్డూరం. ఒక ప్రభుత్వ పథకం అమలు మొదలయ్యాక, అర్హులకు దాని ఫలాలు అందడం లేదంటే అదొక అర్థవంతమైన విమర్శ అవుతుంది.
ఒక ప్రభుత్వం పథకం అమలు తరువాత కూడా… ఇలా బాకీలు పడ్డారు, ఇంటికి రూ. 25 వేల చొప్పున ఇవ్వాల్సినవి ఎగవేశారు అంటూ జగన్ తప్ప దేశంలో ఏ నాయకుడూ ఇలాంటి అర్థంలేని లాజిక్ తో విమర్శలు చెయ్యడు. రానురానూ జగన్ విమర్శలు ఎలా ఉంటున్నాయంటే… పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే అయిపోవాలి, కాలేదు కాబట్టి ఆ ప్రాజెక్టు ఆయకట్టు కిందకి వచ్చే భూముల్లో పండాల్సిన పంటలన్నీ రైతులకు చంద్రబాబు బాకీ ఉన్నారని అంటారేమో..! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలుసు. కేంద్రం మొండి వైఖరిని కళ్లారా ప్రతీ నిత్యం చూస్తున్నారు. విభజిత ఆంధ్రాకు ఆదాయ వనరులు లేవు. ఇన్ని అననుకూల పరిస్థితుల మధ్య కూడా ఇచ్చిన హామీలు ఒక్కోటిగా నిలబెట్టుకుంటూనే వస్తున్నారు. వనరుల సమీకరణలో కొంత ఆలస్యం అవుతోంది కాబట్టి, కాస్త ఆలస్యంగా పనులు జరుగుతున్నాయి. ప్రజలు ఈ కోణం నుంచి పరిస్థితులను అర్థం చేసుకుంటున్నారే తప్ప… జగన్ ఆలోచన తీరు మాదిరిగా బాకీల లెక్కలు వెయ్యడం లేదు. ప్రజలు ప్రతీదీ డబ్బుల రూపంలోనే ఆశిస్తారు, సుపరిపాలన అంటే తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల లెక్కల్నే చూసుకుంటారని మాత్రమే జగన్ ఆలోచించగలుగుతున్నారని చెప్పడానికి ఈ కాకిలెక్కల విమర్శలే సాక్షం.