అనుకున్నదే అయ్యింది. `ఎన్టీఆర్` బయోపిక్ 2 భాగాలుగా రాబోతోంది. `కథానాయకుడు` పార్ట్ 1గానూ, `రాజకీయ నాయకుడు` పార్ట్ 2గానూ విడుదల చేస్తారు. `కథానాయకుడు` జనవరి 9న విడుదల అయితే, `రాజకీయ నాయకుడు` జనవరి 16న విడుదల చేస్తారు. నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన లేనే లేదు. కానీ ఎప్పుడైతే స్క్రిప్టులో కూర్చున్నారో, అప్పుడు సీన్లు అలా వస్తూనే ఉన్నాయట. విష్ణు ఇందూరి తీసుకొచ్చిన కథని బుర్రా సాయిమాధవ్, క్రిష్ కలసి ఆ కథని డెవలెప్ చేసుకుంటూ వేళ్తే 164 సీన్ల వరకూ వచ్చాయట. నిజానికి ఓ సినిమాకి 60 నుంచి 70 సీన్లు సరిపోతాయి. ఏ సన్నివేశాన్నీ పక్కన పెట్టాలనిపించకపోవడంతో ఎన్టీఆర్ బయోపిక్‌ని రెండు భాగాలుగా మార్చేద్దామని ఫిక్సయ్యారు. దాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించేశారు. ఎన్టీఆర్ జననం నుంచి, యవ్వన దశ, కథానాయకుడిగా మారిన వైనం, ఎదుగుదల, స్టార్ డమ్, చేసిన గొప్ప పాత్రలూ ఇవన్నీ `కథానాయకుడు`లో చూస్తాం. అశేష జనవాహిని సమక్షంలో తన పార్టీ పేరుని `తెలుగుదేశం` అని ప్రకటించడంతో తొలిభాగం ముగుస్తుంది. రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైనాన్ని ద్వితీయార్థంలో చూపిస్తారు. ఎన్టీఆర్ అంతిమయాత్రతో ఈ కథ ముగుస్తుంది.