ఎన్టీఆర్ బయోపిక్ అనే ప్రాజెక్టు లోకి క్రిష్ అడుగుపెట్టడంతో లెక్కలన్నీ మారిపోయాయి. బిజినెస్ రేంజ్ పెరిగింది. అభిమానుల అంచనాలూ ఎక్కువయ్యాయి. `రెండు భాగాలు`గా ఈ సినిమా మారడం వెనుక క్రిష్ కృషి చాలా ఉంది. నిజానికి ఓ సినిమాని రెండు భాగాలుగా చేయడం, రెండు భాగాల్ని కలిపి ఒకేసారి తెరకెక్కించడం మామూలు విషయాలు కాదు. దాదాపు 150 సన్నివేశాల్ని తెరకెక్కించాలి. తొలి సగం చూసి సరిపెట్టుకోకూడదు. `రెండో భాగం కూడా చూడాలి` అనే ఉత్సుకత రేపాలి. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ కథలో ఆ కోణం కనిపించింది. ఎన్టీఆర్ సినీ జీవితం ఒక భాగం – ఎన్టీఆర్ రాజకీయ జీవితం మరో భాగంగా చూపించాలని ఫిక్సయ్యారు. ఎన్టీఆర్ అభిమానులకు రెండూ కావాలి. రెండు భాగాలు అన్న నిర్ణయం తీసుకోవడం వల్ల… ఎన్టీఆర్ జీవితంలోని ప్రతి ఘట్టాన్నీ కూలంకుశంగా చూపించే ఆస్కారం దక్కింది.
అయితే… క్రిష్ చేతిలో చాలా తక్కువ సమయం ఉంది. ఈ ప్రాజెక్టులోకి క్రిష్ అడుగు పెట్టడమే ఆలస్యం… పనులన్నీ చకచక సాగిపోయాయి. క్రిష్ లో స్పీడెక్కువ. ఒకేరోజు రెండు మూడు సన్నివేశాల్ని అవలీలగా తెరకెక్కించే సమర్థుడు. ఓ భాగం తీశాక – దాని రిజల్ట్‌ని బట్టి రెండో భాగం ఆలోచిద్దాం అని అనుకోకుండా.. స్క్రిప్టు ప్రకారం అనుకున్న సన్నివేశాల్ని అనుకున్నట్టు తీసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇప్పటికే `కథానాయకుడు` అనే పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతమంది ఆర్టిస్టులతో, ఇంత వేగంగా సినిమాని తీయగలగడం క్రిష్‌కే సాధ్యమనిపిస్తోంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని ఇలా పరుగులు పెట్టిస్తూ, ఈ సినిమా రేంజ్ అంతకంతకూ పెంచుతున్న క్రిష్‌ని చూస్తే ముచ్చటేస్తుంది. రెండు భాగాలుగా చేయడం వల్ల రాబడి కూడా అదే స్థాయిలో ఉండబోతోంది. `ఎన్టీఆర్` బయోపిక్ విలువ రూ.80 కోట్లు అనుకుంటే.. తాజా నిర్ణయంతో 150 కోట్లకు చేరింది. ఇది కూడా క్రిష్ ఘనతే అనుకోవాలి.