‘వారానికి ఐదు’ అంటూ ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గత కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈవారం కూడా మరో ఐదు ప్రశ్నలు తన రొటీన్ లో భాగంగా పంపించేశారు! ఇప్పటివరకూ ఈ ప్రశ్నల జాబితా 70 కి చేరుకుంది. కేంద్రం నుంచి నిధులు రావడం లేదంటూ దొంగ దీక్షలు చేస్తున్నారనీ, వచ్చిన నిధులేంటో ప్రభుత్వ వర్గాలకు తెలుసుననీ, ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకుంటూ లెంపలేసుకుని ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలన్నారు కన్నా. శ్రీకాకుళం జిల్లాలోని కేంద్రం పరిధిలోని కొన్ని భూములను నేతలు కబ్జా చేస్తున్నారనీ, దానిపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ మరో ప్రశ్న వేశారు. అనవసర ప్రచారార్భాటాలకు పోతూ, ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్రాని మరింత అప్పుల ఊబిలోకి లాగింది టీడీపీ సర్కారు అనేది నిజమా కాదా అంటూ ఇంకో ప్రశ్న. పులిచింత ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగో ప్రశ్న, అమెరికా పర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారంటూ చంద్రబాబు చెప్పిన లెక్కల్లో తప్పులున్నాయన్నది నిజమా కాదా అంటూ ఐదో ప్రశ్న వేశారు.
ఇలా కన్నా చేపడుతున్న వారానికి ఐదు ప్రశ్నలు అనే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. సరే, ఇవన్నీ ప్రజల తరఫున అడుగుతున్న ప్రశ్నలుగానే చెబుతున్నారు, మంచిదే! మరి, ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా అడుగుతున్నారు. విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్రం ఎందుకు అలసత్వం వహిస్తోందని ఎదురుచూస్తున్నారు. ఇలాంటివేవీ కన్నా లక్ష్మీనారాయణకు కనిపించడం లేదా..? టీడీపీ సర్కారుకు వంద ప్రశ్నలు వేసి, అదేదో రికార్డు సాధించామని చెప్పుకోవడానికి తప్ప… ఈ వారాల కార్యక్రమం వల్ల ఏం ఉపయోగం..?
విశాఖ రైల్వే జోన్ పై ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ కేంద్రాన్ని ఒక్కసారి ప్రశ్నించండి! కడప ఉక్కు ఫ్యాక్టరీపై రకరాల అఫిడవిట్లు ఎందుకు ఫైల్ చేశారో కేంద్రాన్ని అడగండి. రెవెన్యూ లోటు భర్తీపై అంకెల గారడీ చేస్తూ చెబుతున్న లెక్కల్లో వాస్తవాలేంటో కేంద్రం నుంచి రాబట్టండి. పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటూ గొప్పగా ప్రచారం చేసుకునేందుకు సిద్ధమౌతున్న కేంద్రం, ఆ ప్రాజెక్టు పనులపై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ చూపించడం లేదు, నిధుల విడుదల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పమనండి! అమరావతిలో రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు కేంద్ర ఎందుకు సమకూర్చడం లేదో లెక్కలు అడగండి! కేంద్రంలో అధికారంలో ఉన్నది వారి పార్టీయే కదా! కాబట్టి, ఒక్కసారి ఇలా ప్రశ్నిస్తే… ఏదో ఒక సమాధానం వస్తుంది కదా. అసలు విషయాలు వదిలేసి వారానికి ఐదు ప్రశ్నలు కన్నా వేస్తూ పోతే ఏం ప్రయోజనం..?