ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ కి ఏకకాలంలో లబ్ధిపొందాలని భావించిన అధికార టీఆర్ఎస్ పార్టీకి… అదే ఫార్ములాతో దెబ్బకొట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ వేస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికలను తమకు జీవన్మరణ సమస్యగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నాయి. ముందస్తుకు వెళ్లడం ద్వారా మొదట అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే..ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేయవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ వైపే ఫ్రజలు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది కాబట్టి.. తరువాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చన్నది కేసీఆర్ వ్యూహం. ఇదే వ్యూహంతో కేసీఆర్కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. తెలంగాణా సెంటిమెంట్ ని అడ్డుపెట్టుకుని 2014 ఎన్నికల్లో కేసీఆర్ ఎలాగైతే అధికారాన్ని కైవసం చేసుకున్నారో., ఇప్పుడు అదే సెంటిమెంట్ ని వాడుకుని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేసింది.
ఉద్యమ సమయంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ ఎంతటి కీలక భూమిక పోషించారో., కేంద్రంలో అప్పటి కాంగ్రెస్ ఎంపీలు కూడా అంతే పాత్ర పోషించారు. నాటి పోరాటంలో తెలంగాణా ఎంపీల పాత్రని కేసీఆర్ తో సహా ఎవ్వరూ కాదనలేనిది వాస్తవం.. కాబట్టి అప్పుడు కేంద్రంలో సొంతపార్టీతోనే పోరాడిన ఎంపీలను ఇప్పుడు అసెంబ్లీ బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. నిజానికి అప్పుడు పోరాడిన ఎంపీలు చాలా మంది 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచీ ప్రజల్లో ఓడిపోయిన సానుభూతి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలపైన ఉంది. ఆ సానుభూతిని ఈ ఎన్నికల్లో వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అప్పటి ఎంపీలంతా ఈ ఎన్నికల్లో తిరిగి పార్లమెంట్ కే పోటీచేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే గత రెండేళ్ల నుంచీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే పనిచేసుకుపోతున్నారు. తాజాగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతుండడంతో అసెంబ్లీ, పార్లమెంట్ కి వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పార్లమెంట్ కి వెళ్లాలనుకున్న తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను మొదట అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టి సెంటిమెంట్ ద్వారా విజయం సాధించాలని కాంగ్రెస్ ఫార్టీ భావిస్తోంది. ఈ సెంటిమెంట్ గనుక వర్కౌట్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చు.. కొంచెం అటూ ఇటూ అయితే వారినే తిరిగి పార్లమెంట్ కి పోటీ చేయించవచ్చని అధిష్టానం భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఎంత ముఖ్యమో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కూడా ఆ పార్టీకి అంతే అవసరం.. కాబట్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం కైవసం చేసుకుంటే గనుక ఎమ్మేల్యేగా పోటీ చేసి గెలిచిన తమ సెంటిమెంట్ అభ్యర్థుల చేత రాజీనామా చేయించి… తిరిగి ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేసుకుంటుంది. ఎలాగూ రాష్ట్రంలో అధికారం ఉంటుంది గనుక ఇటు రాజీనామ చేయించిన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని.., అటు ఎంపీ స్థానాన్ని గెలుచుకోవడం ఈజీ అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ పరిణామాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకుని ఓడిపోయిన వారినే తిరిగి పార్లమెంట్ కి పంపాలని భావిస్తున్నారట.. డబుల్ సెంటిమెంట్ వర్కౌటయి వారు గెలిస్తే రాహుల్ గాంధీ ఫ్రధాని కావడానికి ఈ సీట్లు ఉపయోగపడతాయనేది కాంగ్రెస్ వ్యూహంగా చెబుతున్నారు. ఇలా ఒకే దెబ్బకి రెండు పిట్టలని కొట్టి. కేసీఆర్ ముందస్తు వ్యూహాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేసిందట. ఇందులో భాగంగానే ఇన్నాళ్ళూ కరీంనగర్ పార్లమెంట్ కి పోటీ చేస్తారని భావించిన మాజీ ఎంపీ ఫొన్నం ప్రభాకర్ ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపుతున్నారని జిల్లాలో వార్తలు వినబడుతున్నాయి.. అందుకోసం పొన్నం ప్రభాకర్ కూడా అంగీకరించారు.