త్రివిక్రమ్ అండ్ టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోంది. అక్టోబర్ 11న ‘అరవింద సమేత వీరరాఘవ’ను విడుదల చేస్తామని ప్రకటించేశారు. అందుకని హడావుడి తప్పడం లేదు. ముఖ్యంగా హీరోయిన్ పూజా హెగ్డే డబ్బింగ్ విషయంలో త్రివిక్రమ్ టీమ్ కష్టపడక తప్పలేదు. ‘అరవింద సమేత వీరరాఘవ’తో పాటు హిందీ సినిమా ‘హౌస్‌ఫుల్-4’లో ఆమె నటిస్తున్నారు. రాజస్తాన్‌లోని జైసల్మీర్‌లో హిందీ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందువల్ల, ‘అరవింద…’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కాలేదు. అదేమీ పెద్ద సమస్య కాదు. కాని తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేయకపోతే సమస్యే. ఓ పక్క హిందీ సినిమా షూటింగ్… మరో పక్క తెలుగు సినిమా డబ్బింగ్… ఏం చేయాలో అని ఆలోచించి ఆలోచించి త్రివిక్రమ్ టీమ్‌ని జైసల్మీర్‌లోని తన హోటల్ రూమ్‌లో డబ్బింగ్ స్టూడియో ఏర్పాటు చేయమని అడిగారు. విడుదల తేదీ దగ్గర పడటంతో అలాగే ఏర్పాటు చేశారు. దాంతో పగలు ‘హౌస్‌ఫుల్-4’ షూటింగ్ చేసి, రాత్రి వేళల్లో ‘అరవింద..’కు డబ్బింగ్ చెప్పానని పూజా హెగ్డే తెలిపారు. తెలుగులో తన పాత్రకు పూజా హెగ్డే డబ్బింగ్ చెప్పుకోవడం ఇదే తొలిసారి. బహుశా… ఓ తెలుగు సినిమా కోసం జైసల్మీర్‌లో హీరోయిన్ డబ్బింగ్ చెప్పడం కూడా ఇదే తొలిసారి అయ్యుండొచ్చు!