ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ , విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న కొన్ని సభలలో ఆమె కెసిఆర్ పై తీవ్ర పదజాలంతో విరుచుకు పడింది. అయితే ఆమె భాషలో తీవ్రత ఉన్నప్పటికీ, ఆమె చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఆశించిన ఫలితాన్ని రాబట్టడం లేదు.
కెసిఆర్ ని ఉద్దేశించి, నాలుగున్నరేళ్ల పాటు ఆయన ప్రగతి భవన్ లో, ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు అని విమర్శిస్తూ, కెసిఆర్ పాలన ని విజయశాంతి ఎండగట్టింది. అయితే ఆయన ప్రగతి భవన్ లో కూర్చున్నాడా లేక ఇంకెక్కడ కూర్చుని పనిచేశాడా అన్నది ప్రజలు పెద్దగా పట్టించుకోరు , పనులు పూర్తవుతున్నాయా లేదా అన్నది మాత్రమే వారికి ముఖ్యం. ఆ మాటకొస్తే నాలుగున్నరేళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయింది, సరిగ్గా ఎన్నికల ముందే ప్రత్యక్షమయింది విజయశాంతే. అందుకే ఆమె ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా ఇంతకాలం ఈవిడ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చర్చించుకోవడం కనిపించింది.
అలాగే ఒసేయ్ రాములమ్మ సినిమా లో విలన్ రామిరెడ్డి తో కెసిఆర్ ని పోలుస్తూ విమర్శలు చేసింది విజయశాంతి. ఆ వ్యాఖ్యలు చూసిన వాళ్లు కూడా ఈమె ఇన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ “ఒసేయ్ రాములమ్మ” సినిమా హ్యాంగోవర్ లోనుంచి బయటపడ్డ టు లేదు అని అనుకున్నారు. తనను తాను అప్డేట్ చేసుకోకుండా, నాలుగేళ్ల పాటు ప్రజల మధ్య ఉండకుండా, సరిగ్గా ఎన్నికల ముందు ప్రత్యక్షమై, ఉపన్యాసాలు ఇస్తే బహుశా అవి ఇలాగే ఉంటాయి ఏమో అని జనాలు అనుకోవడం కనిపించింది.