మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి వంటి పూర్తి విభిన్నమయిన సినిమాలను రూపొందించిన ఎస్.ఎస్. రాజమౌళికి ప్రతిష్టాత్మకమయిన పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు తెలుగు ప్రజలు, సినీ పరిశ్రమలో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన సాటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం దీనిపై తనదయిన శైలిలో స్పందించారు. “రాజమౌళికి పద్మశ్రీ దక్కింది. కానీ నాకు కనీసం నా చిన్ననాటి స్నేహితురాలు పద్మ కూడా దక్కలేదు. ఇది బాహుబలియాన్ ఫెయిల్యూర్” అని ట్వీట్ చేసాడు.
వర్మకి అవార్డు రాకపోవడానికి బాహుబలియన్ ఫెయిల్యూర్ కి సంబంధం ఏమిటో అర్ధం కాదు. నిజానికి రామ్ గోపాల్ వర్మే బాహుబలి సినిమాని ఆకాశానికి ఎత్తేశాడు. చిరంజీవి తీయబోయే 150వ సినిమా బాహుబలి కంటే చాలా గొప్పగా, దాని రికార్డులు బ్రద్దలు చేస్తే స్థాయిలో లేకపోతే తనతో సహా మెగా అభిమానులు అందరూ అసంతృప్తికి గురవుతారని చెప్పారు. కనుక వీలైతే రాజమౌళినే దర్శకుడిగా పెట్టుకొని 150వ సినిమా తీస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా కూడా పడేశారు. అంటే బాహుబలి సినిమాని, దానిని తీసిన రాజమౌళిని ఆయన మెచ్చుకొంటున్నట్లు అర్ధం అవుతోంది. కానీ ఇప్పుడు తనకు కూడా పద్మశ్రీ అవార్డు రాకపోవడాన్ని ‘బాహుబలియన్ ఫెయిల్యూర్’ అనడం ఏమిటో అర్ధం కాదు. బహుశః ఆ స్థాయిలో తాను నిరాశ చెందానని చెపుతున్నరేమో?
రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా చాలా ప్రతిభ ఉన్న దర్శకుడే. కానీ తన ప్రతిభని నిరూపించుకొనే సినిమాలు ఎప్పుడో కానీ తీయలేకపోతున్నారు. ఆయన తీసిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నప్పుడు అదే ప్రశ్న ఎవరయినా అడిగినప్పుడు ఆయన “నా సినిమాలు…నా ఇష్టం వచ్చినట్లు తీస్తాను…నచ్చితే చూడండి లేకపోతే చూడడం మానేయమని” చాలా తిక్కగా జవాబులు చెప్పేవారు. ప్రజలు మెచ్చుకొనే గొప్ప సినిమాలు తీయలేకపోయినా కనీసం నోరు మంచిదయితే ఊరు మంచిదయ్యేది. కానీ తిక్కతిక్కగా మాట్లాడటమే గొప్ప అని వర్మ అనుకొంటునప్పుడు ఇక చిన్ననాటి స్నేహితురాలు పద్మ అయినా పద్మశ్రీ అవార్డులయినా ఎందుకు దక్కుతాయి? అని వర్మగారే ఆలోచిస్తే బాగుంటుంది. సినీ పరిశ్రమలో లేదా ఏ రంగంలో ఉన్నా తమ ప్రతిభని నిరూపించుకొని అందరినీ మెప్పించి అభిమానం పొందగలిగినవారికే ఇటువంటి గౌరవాలు, పురస్కారాలు లభిస్తాయి తప్ప ప్రతిభని నిరూపించుకోలేని వారు, కనీసం సరిగా మాట్లాడటానికి కూడా ఇష్టపడనివారు ఇటువంటివి ఆశించడం అత్యాశే అవుతుంది కదా?