‘చిలసౌ’ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ మెగాఫోన్ పట్టాడు. దర్శకుడిగా తన ప్రతిభను ప్రేక్షకులకు చూపించాడు. రాహుల్ రవీంద్రన్ కంటే ముందు ఎంతోమంది హీరోలు దర్శకులుగా మారి సినిమాలు తీశారు. హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ యేడాది రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరో హీరో దర్శకుడిగా రావడానికి సిద్ధంగా వున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలో మెయిన్ హీరోగా నటించిన విశ్వక్ సేన్ గుర్తున్నాడా? అతను దర్శకుడిగా మారుతున్నాడు. విచిత్రం ఏంటంటే… సినిమాలో అతను ఓ షార్ట్ ఫిల్మ్ దర్శకుడిగా కనిపించాడు. ‘ఈ నగరానికి ఏమైంది?’ కంటే ముందు ‘వెళ్ళిపోమాకే’ అనే సినిమాలోనూ హీరోగా నటించాడు. హీరో అవ్వక ముందు ‘పిట్టకథ’ అని ఒక ఫిల్మ్‌కి డైరెక్షన్ చేశాడు. ఫీచర్ ఫిల్మ్ వివరాలకు వస్తే… మలయాళ సినిమా ‘అంగమలై డైరీస్’ని విశ్వక్ సేన్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడట!! మలయాళ సినిమాలో 86 మంది నటీనటులను పరిచయం చేశారు. తెలుగులో ఎవరితో? ఎలా? తీస్తాడో మరి!!