మూడు రోజుల కిందటి ముచ్చటిది..! కేసీఆర్ వనపర్తి సభకు పోయిండు. అరంగట సేపు మాత్రం… ప్రసంగించి…ఐదున్నరవుతోంది… తర్వాత హెలికాఫ్టర్ లెగవదని అందరికి చెప్పి… హడావుడిగా వెళ్లిపోయిండు. చాలా మంది నిజమే కాబోలు అనుకున్నారు. కానీ అంతకు ముందు రోజు నల్లగొండలో ఏడుదాటే వరకూ ప్రసంగించారే అన్న డౌట్ తర్వాత చాలా మందికి వచ్చింది. అదే హెలికాఫ్టర్ తో కేసీఆర్ ప్రయాణం. మరి ఎందుకు తేడా..! .. ఆలోచించంగా.. ఆలోచించంగా తెలిసింది ఏమిటంటే… ముహుర్తం..! ముహుర్తం కారణంగా.. హెలికాఫ్టర్ ఎగరదని..!
దేశంలో నమ్మకాల పరంగా దేశంలోని నెంబర్ వన్ సీఎం. ఆయన సెక్రటేరియట్ మొహం చూడకపోవడానికి.. ఉన్న క్యాంపాఫీస్ స్థానంలో రూ. 300 కోట్లు పెట్టి కొత్తది కట్టడానికి.. అలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కూడా ముహుర్తాలే కారణమని చెబుతారు. కానీ ఇప్పుడు ఎన్నికల తేదీ, కౌంటింగ్ కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయా..? ముహూర్తాలు, సెంటిమెంట్లను నమ్మే వారికి పోలింగ్ తేదీ అంత అనుకూలంగా లేదని పండితులు చెబుతున్నారు. పోలింగ్ జరగనున్న డిసెంబరు ఏడో తేదీ అమావాస్య కావడమే ఇందుకు కారణం. ఇక, ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబరు 11 కూడా చవితి. ముహూర్తాలు, సెంటిమెంట్లను బలంగా విశ్వసించే ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ముహూర్తం చూసుకునే అసెంబ్లీని రద్దు చేశారు. తన లక్కీ నంబరు 6న శ్రావణ మాసం, గురువారం మధ్యాహ్నం ద్వాదశి ఘడియల్లో పుష్యమి నక్షత్రం ప్రవేశించిన తర్వాత గురు పుష్య యోగంలో అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేశారు.
కేబినెట్ భేటీ, గవర్నర్‌తో సమావేశం, 105 మంది అభ్యర్థుల ప్రకటనలు.. అంతా ముహూర్తాల ప్రకారమే చేశారు. ఈ నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ తేదీలు కూడా కేసీఆర్ జాతకానికి అనుగుణంగానే వస్తాయా? అని చర్చ జరిగింది. నవంబరులో ఎన్నికలు, డిసెంబరులో ఫలితాలు వెలువడతాయని కేసీఆర్ అనడంతో అంతా మాట్లాడేసుకున్నారని అనుకున్నారు. నవంబర్ ఇరవై నాలుగున పోలింగ్ జరుగుతుందని… మీడియాలో లీకులొచ్చాయి. కానీ తర్వాత ఏమయిందో కానీ.. తెలంగాణ పోలింగ్ తేదీని అమావాస్య అయిన డిసెంబరు 7న; కౌంటింగ్‌ను చవితి అయిన 11గా నిర్ణయించారు. అయితే కొంత మంది పండితులు మాత్రం మరో లెక్క తీస్తున్నారు.. పోలింగ్ రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉందని, అది కేసీఆర్ కు జన్మతార అవుతుందంటున్నారు. ఓట్ల లెక్కింపు జరిగే 11న ఉత్తరాషాఢ నక్షత్రం ఉందని, అది కేసీఆర్‌కు క్షేమతార అవుతుందని, ఇది ఆయనకు కలిసొచ్చే విషయమని అంటున్నారు. మొత్తానికి ఫలితాలు అనుకూలంగా వస్తే.. ఓ వాదన లేకపోతే మరో వాదన ఖరారు చేసుకోవచ్చు.