విభజన తరువాత నవ్యాంధ్రను చాలా అభివృద్ధి చేశామని ప్రధాని మోడీ మొదలుకొని రాష్ట్ర స్థాయి భాజపా నేతల వరకూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రానికీ ఏ కేంద్ర ప్రభుత్వమూ చేయనంత సాయం మోడీ సర్కారు చేసేసిందంటారు! 85 శాతం హామీలు అమలు చేసేశామని కొన్నాళ్లు అనేవారు. ఈరోజు, కేంద్రం కృషితో ఆంధ్రాలో అభివృద్ధి అంటూ కొన్ని పత్రికా ప్రకటనలను విడుదల చేశారు. ప్రముఖ దిన పత్రికల్లో ఇచ్చిన ప్రకటన ఏంటంటే… ‘కేంద్ర ప్రభుత్వ కృషితో ఆంధ్ర రాష్ట్ర నగరాల్లో అపూర్వ అభివృద్ధి’ అంటూ స్వచ్ఛభారత్ మిషన్, అమృత్, స్మార్ట్ సిటీ మిషన్ వంటి కేంద్ర పథకాలతో ప్రజల జీవితాల్లో అనేక మార్పులు వస్తున్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు! ‘అనేక మార్పులు’ అంటే ఏంటో మరి..? ఆ మార్పులు ఎక్కడ వచ్చాయో వారికే తెలియాలి.
ఏపీలో 33 నగరాలు అమృత్ పథకానికి ఎంపికయ్యాయనీ, దీనికి రూ. 2890 కోట్ల బడ్జెట్ ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతి స్మార్ట్ నగరాలుగా అభివృద్ధి చేయడానికి రూ. 877 కోట్లు విడుదల కాబోతున్నాయన్నారు! వారసత్వ నగరాల అభివృద్ధికి సంబంధించి వాటిలో అమరావతి కూడా ఎంపికైందని చెప్పారు. ఆంధ్రాలో అపూర్వ అభివృద్ది అంటే ఇదేనా..? అభివృద్ధి చేసేశామని ఈ ప్రకటన ద్వారా చెప్పాలనుకుంటున్నారా, భవిష్యత్తులో చేస్తామని ఇప్పుడు చెప్పాలని భావిస్తున్నారా..? సార్వత్రిక ఎన్నికలకు పట్టుమని ఏడాది కూడా సమయం లేదు. ఇప్పుడు కూడా చేయబోతున్నాం, జరగబోతున్నాయి, బడ్జెట్ లో నిధులున్నాయి, కేటాయింపులు జరుగుతున్నాయి అంటూ ఇలా ప్రకటనలు ఇచ్చుకోవడం వల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చే తప్ప… దీని వల్ల ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
నవ్యాంధ్రకు కేంద్రం సాయం చాలా అందుతున్నది అంటూ కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నారు! అలాంటప్పుడు, ఆ అందించినవే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా! 85 శాతం హామీలు నెరవేర్చారంటారే… మరి ఈ పత్రికా ప్రకటన ద్వారా చెప్పుకోవడానికి పట్టుమని పది కూడా దొరకలేదా..? నాలుగు కేంద్ర పథకాలు పేర్లు రాసి… దాంతోనే అపూర్వ అభివృద్ధి అంటే ఎలా..? ఈ పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలౌతాయి కదా. విభజిత రాష్ట్రంగా ఆంధ్రాపై కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ ఎక్కడుంది అనేదే అసలు ప్రశ్న? ఆంధ్రాని అభివ్రుద్ది చేస్తాం అంటూ ఇంకా జరగాల్సిన విషయాలనే ఇలా ప్రకటనల ద్వారా ప్రజలకు చెప్పడమంటే… చెయ్యాల్సినవి చెయ్యలేదని ఒప్పుకున్నట్టే కదా.