తెలంగాణ ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ లేని పార్టీలు, కాంగ్రెస్ ముసుగులో రాష్ట్రంలోకి వస్తున్నాయంటే కేసీఆర్ సహించరని చెప్పారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… తెలంగాణలో టీడీపీ ఉనికి తమకు ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయం సరైంది కాదని ఖండించారు. టీడీపీ మహా కూటమితో జతకడితే తాము కంగారు పడటం లేదనీ, ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటూ కేసీఆర్ విమర్శల్ని సమర్థించుకొచ్చారు. రాష్ట్రంలో పూర్తిగా లేని టీడీపీని, పాలుపోసి మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందనీ, పొరపాటు టీడీపీకి కొన్ని సీట్లొచ్చినా గెలిచినవారు తెలంగాణ తరఫున మాట్లాడరని కవిత అన్నారు.
గడచిన నాలుగేళ్లలో హైకోర్టులో కాంగ్రెసోళ్లు కేసు వేస్తుంటే, వెనక నుంచి చంద్రబాబు మేనేజ్మెంట్ తో ఆర్డర్ రావాలి అన్నట్టుగా నడిచిందని ఆరోపించారు కవిత. తెరాస సర్కారుపై కాంగ్రెస్ వేసిన కేసుల వెనక పరోక్షంగా చంద్రబాబు నాయుడు మద్దతు ఉందని తాము నమ్ముతున్నామన్నారు. 2009లో జై తెలంగాణ అని టీడీపీ కూడా అన్నది కాబట్టే పొత్తు పెట్టుకున్నామనీ, తెలంగాణ వచ్చాక కూడా అలాంటి పార్టీలు ఇక్కడుంటే గడచిన నాలుగేళ్ల మాదిరిగానే భవిష్యత్తులోనూ అభివృద్ధికి అడ్డుపడుతూ ఉంటారన్నారు. ఇక్కడ స్థిరపడ్డ ప్రజలందరూ తెలంగాణవారేననీ, తాము ఉద్యమ సమయంలో విమర్శించింది కూడా ఆంధ్రా ప్రాంత నాయకుల్నే తప్ప, ఆంధ్రా ప్రజలను కాదని స్పష్టం చేశారు కవిత. చంద్రబాబు నాయుడుకి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు అంటే… కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అన్నారు.
విచిత్రం ఏంటంటే… కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ వేసిన కేసుల వెనక చంద్రబాబు సాయం ఉందని కవిత ఆరోపించడం..! ఆ కేసులు ఇవాళ్ల కొత్తగా వేసినవి కాదు కదా! తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యాకో, లేదంటే మహాకూటమి తెరమీదికి వచ్చాకో వెయ్యలేదు కదా. మరి, గడచిన నాలుగేళ్లలో ఈ అంశం ఎంపీ కవితగానీ, తెరాస నాయకత్వానికిగానీ కనిపించలేదా..? కేసుల వెనక చంద్రబాబు మద్దతు ఉంటే… ఆరోజే ఇలాంటి ఆరోపణలు ఎందుకు చెయ్యలేదు, ఇప్పుడు ఎన్నికలు దగ్గరకి రావడంతోనే ఎందుకు ప్రస్థావిస్తున్నట్టు..? తెలంగాణలో టీడీపీ లేదని చెబుతూనే, లేనిపార్టీని కాంగ్రెస్ తీసుకొస్తోందని కవిత వ్యాఖ్యానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లేని పార్టీని ఎవరు తీసుకొచ్చినా ప్రభావం ఉండకూడదు కదా! అలాంటప్పుడు, టీడీపీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎందుకీ విమర్శలు..? తెలంగాణ తెరాసకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ కంటే, ప్రాతినిధ్యం లేదని వారే చెబుతున్న టీడీపీని ఎందుకు ప్రధాన లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారనే ప్రశ్నకు కేసీఆర్ నుంచి కూడా సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు, ఇప్పుడు కవిత నుంచి కూడా స్పష్టమైన వివరణ లేదు..!