ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలకు సంబంధించిన సర్వేను ఏబీపీ న్యూస్ – సీ ఓటర్ సంస్థ వెల్లడించింది. ఈ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాకాశాలు ఉన్నట్లు తేలినా… ఇందులోనూ కాస్తంత మొగ్గు బీజేపీ వైపు వేయాడనికే ప్రయత్నించారు. రాజస్థాన్లో వసుంధరరాజే సింధియా ప్రభుత్వంపై.. ఎక్కడ లేని అసంతృప్తి ఉందని… కొద్ది రోజులుగా బీజేపీ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి. దానికి తగ్గట్లుగా అక్కడ జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సారి ఎన్నికల్లో..భారతీయ జనతా పార్టీ రేసులో లేదని మాత్రం తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ 142 స్థానాల్లో గెలుస్తుందని.. బీజేపీకి కేవలం 56 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో తుడిచి పెట్టుకుపోయింది. ఐదేళ్లలోనే వసుంధర రాజే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది.
ఇక మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్లలో బీజేపీ గత పదిహేనేళ్లుగా.. అధికారంలో ఉంది. అయితే.. అక్కడ ప్రభుత్వాలపై అసంతృప్తి ఉంది కానీ.. అది తీవ్రమైనదేమీ కాదని… సర్వే చెబుతోంది. కానీ ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఉందని అంచనా వేస్తోంది. మధ్యప్రదేశ్లో 230 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 122 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. కానీ బీజేపీ అంత తీసి పడేసే పరిస్థితిలో లేదట. 108 వరకూ తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. చత్తీస్ గఢ్లోనూ అంతే.. 90 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్కు 47, బీజేపీకి 40 రావొచ్చని అంచనా వేశారు. ఇప్పటికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లే. ఇదే సీ వోటర్ సర్వే గత వారంలో… రిపబ్లిక్ టీవీ కోసం చేసిన ఓ సర్వేలో… మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్లలో.. 70 శాతం పార్లమెంట్ సీట్లు బీజేపీకే వస్తాయని ప్రకటించింది. అయితే.. వారంలోనే… భిన్నమైన నివేదిక ఇచ్చింది. అది పార్లమెంట్ .. ఇది అసెంబ్లీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారేమో. ..?
బీజేపీకి మద్దతుగా ఇటీవలి కాలంలో సర్వేలు హోరెత్తుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లోనూ అంతే. మొదట్లో పోటాపోటీగా ఉందని… అస్మదీయ మీడియా సంస్థలతో ప్రచారం చేయించారు. ఆ తర్వాత మోడీ ప్రచారం ప్రారంభించగానే.., ఆయన లెగ్గు మహిమ.. ప్రచార పటిమతో… బీజేపీని గెలిపించబోతున్నారని.. బీజేపీ గెలవబోతోందని.. సర్వే ఫలితాలు ప్రకటించారు. ఇప్పుడు రాజస్థాన్ లో వసుంధర రాజే అంటే.. ఎలాగూ… మోడీ, షాలకు పడదు కాబట్టి.. ఆమె గ్యారంటీగా ఓడిపోతుందని చెప్పిస్తున్నారు. మిగతా ఇద్దరూ మోడీకి సన్నిహితులే కాబట్టి… వారు వెనుకబడినా… రేసులో ఉన్నారని చెప్పిస్తున్నారన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి. ముందు ముందు ఇలాంటి సర్వేలు… చాలా హోరెత్తబోతున్నాయి. ఈ సర్వేల్లో..అన్ని పార్టీలు గెలుస్తాయి. అసలు ప్రజాతీర్పు మాత్రం డిసెంబర్ 11వ తేదీన తేలనుంది.