ఈనెల 15 నుంచి ప్రజాపోరాట యాత్రకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేతలతో పవన్ దాదాపు రెండు గంటలకుపైగా సమావేశమయ్యారు. పర్యటన ప్రారంభం నాడు ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ మీద కవాతు నిర్వహణకు ఏర్పాట్లపై చర్చించారు. ఈ కవాతు గురించి తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా చర్చించుకునే విధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. ఇక, ఈ జిల్లాలోని మొత్తం 19 నియోజక వర్గాల్లోనూ జనసేన పోటీ చేయాలన్న వ్యూహంలో ఉంది. వీటిలో మరీ ముఖ్యంగా… గతంలో ప్రజారాజ్యం కైవసం చేసుకున్న స్థానాలపై పవన్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారట.
పెద్దాపురం, పిఠాపురం, కొత్తపేట, కాకినాడ రూరల్… ఈ నాలుగు నియోజక వర్గాల్లో 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం గెలిచింది. అంతేకాదు, కాకినాడ లోక్ సభ స్థానంలో కూడా అప్పట్లో ప్రజారాజ్యం గట్టిగానే పోటీ ఇచ్చింది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన పల్లంరాజుకి కూడా అప్పట్లో ముచ్చెమటలే పట్టాయి. సామాజిక వర్గం పరంగా అప్పట్లో చిరంజీవి పార్టీకి ఈ జిల్లా నుంచి మంచి మద్దతే లభించింది. ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాతి నుంచి ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే ప్రత్యేక పార్టీ అంటూ లేకుండా పోయిందనేది వారి అభిప్రాయం! ఇప్పుడు, జనసేనను తమ సొంత పార్టీగా ఆ సామాజిక వర్గం చూస్తోంది. దీంతో ఈ జిల్లాల్లో జనసేనకు కాస్త సులువుగానే బలమైన పునాదులు ఏర్పడ్డాయనేది వారి అంచనా! గతంలో ప్రజారాజ్యం దక్కించుకున్న ఆ నాలుగు నియోజక వర్గాలను కచ్చితంగా ఈసారి గెలవాలనే పట్టుదలతో జనసేన ఉన్నట్టు సమాచారం.
నిజానికి, ఓ మూడు నెలల కిందటే ఈ నాలుగు నియోజక వర్గాల్లో జనసేనాని ప్రాథమికంగా ఒక సర్వే చేయించారనీ, ఈ స్థానాల్లో టీడీపీ, వైకాపాల పట్టుపై కొంత అవగాహనకు వచ్చారనీ సమాచారం! తాజా యాత్ర నేపథ్యంలో జనసేన తరఫున బరిలోకి దింపబోతున్న అభ్యర్థులకు సంబంధించి కూడా పవన్ ఒక స్పష్టతకు వస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఆ నాలుగు స్థానాలతోపాటు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లోనూ బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలన్నదే పవన్ పట్టుదల అంటున్నారు! అయితే, ఇప్పటివరకూ జనసేనలో చేరినవారిలో వైకాపా నుంచి వచ్చినవారే ఎక్కువమంది ఉండటం గమనార్హం. అభ్యర్థుల ఎంపిక వరకూ వచ్చేసరికి ఇంకా కొత్త చేరికలు ఏవైనా ఉంటాయేమో చూడాలి.