తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న జిల్లా నల్లగొండ జిల్లా. నిన్నామొన్నటి వరకు..టీఆర్ఎస్లో అసమ్మతి కుంపట్లు రేగాయి. కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందర్నీ పిలిపించి మాట్లాడారు. దాంతో కొంత వరకు సమస్య సద్దుమణిగినట్లయింది. పలు నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులను బుజ్జగించడంలో కేటీఆర్ సక్సెస్అయ్యారు. కేసీఆర్ కోదాడ, హుజూర్నగర్ల అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాలు మినహా మిగిలిన ఎనిమిది స్థానాల్లో అసమ్మతి భగ్గుమంది. అభ్యర్థులను మార్చాల్సిందేనని పట్టుబట్టారు.
అయితే కొంత మంది పార్టీ మారడంతో.. దేవరకొండలాంటి చోట్ల అసమ్మతికి చెక్ పడింది. మునుగోడులో అసమ్మతి నేత వేనేపల్లి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించారు. ఆలేరులో అసమ్మతిపై నీళ్లు చల్లగా, భువనగిరిలో చేతులు కలిపించారు. తుంగతుర్తిలో కూడా మందలింపులతో సరిపెట్టారు. నాగార్జున సాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో పార్టీ అధినాయకత్వం కల్పించుకోవాల్సి వచ్చింది. మిర్యాలగూడలో మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. అన్నీ అనుకూలించి కాంగ్రెస్ టికెట్ వస్తే ఆ పార్టీ తరఫున, లేదంటే ఇండిపెండెంట్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారని పేర్కొంటున్నారు.
నల్లగొండలో ఒక విధంగా పార్టీకి కార్యకలాపాలకు దూరంగా ఉన్న మాజీ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. దీంతో ఆయన కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ ఒకసారి పిలిపించి మాట్లాడినా, నిర్ణయం మార్చుకోకుండా నల్లగొండ మాజీ ఇన్చార్జి చకిలం అనిల్ కుమార్ పోటీలో ఉంటానని ప్రకటించి ప్రచారం చేసుకుంటున్నారు. నాగార్జున సాగర్‌లో అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబట్టిన అసమ్మతి నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, ఆయన అనుచర నాయకులు, ఇతర ముఖ్యులను కేటీఆర్, జగదీశ్‌రెడ్డి తాయిలాలతో సర్దుబాటు చేశారు. తుంగతుర్తిలో అసమ్మతి నాయకుడు మందుల సామేలుకు ఇప్పటికే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా కొనసాగుతున్నందున ఒప్పించారని అంటున్నారు. భువనగిరిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి, అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిల మధ్యా సయోధ్య కుదిర్చారు. అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న కోదాడలో ఇన్చార్జి శశిధర్ రెడ్డి, హుజూర్నగర్ ఇన్చార్జి శంకరమ్మ ఇంకా బెట్టు వీడడం లేదంటున్నారు. ఇక్కడ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ రెండు చోట్లా అసమ్మతి పొగ గుప్పుమనే అవకాశాలు ఉన్నాయి.