తను డైరెక్ట్ చేసిన సినిమాలు డైరెక్టర్‌గా తనకెంతో పేరు తెచ్చినా దాన్ని అంతగా పట్టించుకోడు రాజమౌళి. ఏదైనా సినిమా ఫంక్షన్‌కి వచ్చినపుడు అతన్ని పొగుడుతున్నా తాను మునగ చెట్టెక్కడు. ఆ పొగడ్తలకు తాను సరిపోనని వినమ్రంగా సమాధానం చెప్తాడు. అలాగే ఇతర సినిమాల ఫంక్షన్లకు వచ్చినపుడు ఏమాత్రం ఈగో లేకుండా ఆ సినిమా ట్రైలర్‌లో తనకేం నచ్చిందో చెప్తాడు. ఆ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఏవిధంగా చూసినా పాజిటివ్‌గానే వుండే రాజమౌళికి అవార్డులంటే ఎక్కడ లేని ఎలర్జీ. ఏ సంస్థయినా తనకు అవార్డు ప్రకటిస్తే సున్నితంగా దాన్ని తిరస్కరిస్తాడు. ఆ అవార్డు తీసుకోవడానికి కూడా వెళ్ళడు. అలాంటిది ఇప్పుడు వచ్చిన పద్మశ్రీ అవార్డు విషయంలో ఏం జరిగిందో, ఎలా అతనికి పద్మశ్రీ వచ్చిందో చూడండి..
రాజమౌళిలాంటి గొప్ప దర్శకుడికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం సబబుగా భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో గత సంవత్సరం రాజమౌళిని సంప్రదించగా, తనకు ఇలా అవార్డులు తీసుకోవడం ఇష్టం లేదని తిరస్కరించాడట. ఈ విషయంలో రాజమౌళిపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చిన ప్రభుత్వం తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఈ సంవత్సరం మాత్రం అతన్ని సంప్రదించకుండానే అవార్డు కమిటీకి రాజమౌళి పేరును పంపారు. తన పేరు పంపవద్దని రిక్వెస్ట్ చెయ్యడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని విరమించుకుంది. మరి తన పేరుని ఎవరు పంపారా అని ఆరా తీస్తే కర్ణాటక ప్రభుత్వం పంపిందని తెలిసిందట. రాజమౌళి పుట్టింది కర్ణాటకలో కావడంతో ఆ ప్రభుత్వం రాజమౌళి పేరుని పద్మశ్రీకి సిఫార్సు చేసిందట. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు తనపై ఇంత అభిమానం వుండడం తన అదృష్టం అని మాత్రం చెప్తున్నాడు.