ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఆంద్రప్రదేశ్లో `అరవింద సమేత వీర రాఘవ`కి ప్రత్యేక అనుమతి లభించింది. రోజుకి నాలుగు ఆటలు కాదు.. ఆరు ఆటలు ఆడించుకునే సౌలభ్యం అరవిందకు దొరికింది. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల లోపు అదనంగా రెండు షోలు వేసుకునే అవకాశం ఇస్తూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అరవింద సమేత నిర్మాతకు, బయ్యర్లకూ కలిసొచ్చే అంశమే. దసరా సీజన్లో విడుదల అవ్వడం అరవిందకు కలిసొచ్చిన విషయం. సెలవుల్ని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక ఆటలకు అనుమతి ఇవ్వాల్సిందిగా చిత్రబృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం ఈనెల 11 నుంచి 18 వరకూ ప్రత్యేక ఆటలకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. ఈ విషయమై అరవింద బృందం… తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి, మరో సారి అభ్యర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక ఆటలు కుదరకపోయినా కనీసం 10వ తేదీన బెనిఫిట్ షోలకైనా అనుమతి ఇవ్వమని చిత్రబృందం కోరనుంది.