ఏపీలో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై… ఐటీ మంత్రి లోకేష్ స్పందించారు. ఐటీ దాడుల పేరుతో ఏపీపై కక్ష సాధిస్తున్నారని లోకేష్ తేల్చి చెప్పారు. 19 టీములతో .. 200 మంది అధికారులు దాడులు చేయడం ఎప్పుడైనా జరిగిందా అని లోకేష్ ప్రశ్నించారు. ఒకరిద్దరిపై గతంలోనూ ఐటీ దాడి చేస్తే పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా..? అని ప్రశ్నించారు.
ఐటీ దాడులు జరిగితే.. చంద్రబాబు వణికిపోతున్నారని.. మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించడం విడ్డూరమని.. ప్రతిపక్ష నేత జగన్ చేసిన విమర్సలపైనా లోకేష్ స్పందించారు. ఏపీలో పెట్టుబడులు పెడుతోన్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తే మేం మాట్లాడకూడదా..? అని ప్రశ్నించారు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వారు కూడా విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడడమా..? అని ఎద్దేవా చేశారు. దేశంలోని టాప్-3 కంపెనీలు ఏపీకి వచ్చాయని గుర్తు చేశారు. భూముల కేటాయింపులపై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. పెద్ద కంపెనీలకు భూములివ్వడం తప్పేమిటన్నారు. భూకేటాయింపులపై ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. ఇప్పటి వరకు మేం ఏడుసార్లు ఆస్తులు ప్రకటించాం.. ప్రతిపక్ష నేతలు కూడా ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మొదట్లో లక్ష మందికి ఐటీ ఉద్యోగాలంటే అవహేళన చేశారు.. ఇప్పటికే 36 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. మరో 1.25 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు.
గన్నవరంలో… హెచ్సీఎల్ సంస్థ భారీ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన ేచసారు. ఆంధ్రప్రదేశ్ కి హెచ్ సీ ఎల్ రావడం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఒక స్టార్ట్ అప్ కంపెనీలా అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్నామని లోకేష్ వివరించారు. సింగపూర్, చైనా దేశాల్లా సంక్షోభాన్ని అవకాశం గా మార్చుకుంటున్నామన్నారు. ఏపీ విద్యార్థుల్లో ఐటీ స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని.. హెచ్ సీ ఎల్ యాజమాన్యం ప్రకటించింది.