ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న రచయిత పేరు – బుర్రా సాయిమాధవ్. కృష్ణం వందే జగద్గురుమ్తో వెలుగులోకి వచ్చిన బుర్రా సాయిమాధవ్ కంచె, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. గౌతమి పుత్ర శాతకర్ణిలో బాలయ్య నోట… బుర్రా డైలాగులు డైనమైట్లలా పేలాయి. ‘ఖైది నెం.150’ లాంటి విజయవంతమైన చిత్రాలు బుర్రా చేతిలో పడ్డాయి. ఇప్పుడు ‘ఎన్టీఆర్’,’సైరా’ చిత్రాలకు తనే మాటల రచయిత. తాజాగా రాజమౌళి చిత్రాన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. డిమాండ్‌ని బట్టే టాలీవుడ్లో రేటు. అందుకే బుర్రా కూడా రేటు పెంచేశాడు. ఇప్పటి వరకూ ఒక సినిమాకి రూ.30 నుంచి రూ.40 లక్షలు డిమాండ్ చేసే బుర్రా సాయిమాధవ్ .. రాజమౌళి చిత్రానికి గానూ 75 లక్షల వరకూ అందుకోబోతున్నాడని తెలుస్తోంది. ఇటీవల ‘దేవదాస్కి’ మాట సాయం చేశాడు బుర్రా. అందులో బుర్రా రాసింది 4 సన్నివేశాలే. అయినా సరే… అశ్వనీదత్ భారీ మొత్తంలో పారితోషికం ముట్టజెప్పారని తెలుస్తోంది. అప్పట్లో త్రివిక్రమ్ ఒక్కో సినిమాకీ కోటి రూపాయలు పారితోషికం అందుకునేవాడు. ఆ తరవాత కోన వెంకట్‌కీ ఆ స్థాయి వచ్చింది. ఆ తరవాత కోనకు ఫ్లాపులు ఎదురై తన డిమాండ్‌ని పొగొట్టుకున్నాడు. బుర్రా జోరు చూస్తే త్వరలోనే కోటి మార్కు అందుకునేట్టు కనిపిస్తున్నాడు.