మోడీ హవా… 2014 ఎన్నికల్లో ఈ ఒక్క మాటతోనే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం కొనసాగింది. మోడీ అధికారంలోకి వస్తే… దేశం మారిపోతుందంటూ.. ‘మోడీ బ్రాండ్’ ఇమేజ్ మీదనే భాజపా గెలిచిందనడంలో సందేహం లేదు. అంతేకాదు, ఆ తరువాత… అంటే, వివిధ రాష్ట్రాల్లో వరుసగా జరుగుతూ వచ్చిన ఎన్నికలు తీసుకున్నా.. మోడీ హవా అన్నట్టుగానే ఎన్నికలు సాగాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే… భాజపా తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మోడీ ఉన్నారేమో అనే స్థాయిలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అది మోడీ వెర్సెస్ ఇతర పార్టీలు అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇతర నాయకుల కేంద్రంగా భాజపా ప్రచారం అనేది గడచిన నాలుగున్నరేళ్లలో ఎక్కడా లేదు. అయితే… ఇప్పుడు అదే మోడీ కటౌట్ ను పక్కన పెట్టి ప్రచారం చేయాల్సిన పరిస్థితి వస్తోందా అంటే… ఆ దశ ప్రారంభం అయిందనే దాఖలాలు కనిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల్ని భాజపా ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత ఈ మూడు రాష్ట్రాలూ భాజపా ఖాతా నుంచి చేజారడం ఖాయమంటూ తాజాగా సీ ఓటర్ సర్వే వచ్చింది. ఇంతకుముందు వెలువడ్డ సర్వేలు కూడా భాజపాకి ఎదురు గాలి అని చెబుతూ వచ్చాయి. అయితే, మధ్యప్రదేశ్ మీద టైమ్స్ నౌ కూడా తాజాగా ఓ సర్వే విడుదల చేస్తూ… ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను రాష్ట్రంలో 38 శాతం ప్రజలు కోరుకుంటున్నారనీ, మిగతా వాళ్లంతా అంతకంటే తక్కువ ఆదరణతో ఉన్నారనీ, కాబట్టి ఆ రాష్ట్రంలో భాజపా మరోసారి అధికారంలోకి రావచ్చనేది ఆ సర్వే అంచనా.
ఒక సర్వే భాజపాకి ప్రతికూలంగా రాగానే.. ఆ వెంటనే మరో సర్వే అనుకూలంగా రావడం అనేది సహజంగా జరుగుతున్నదే. అయితే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఉన్న మంచి పేరు మీదే భాజపా ప్రచారం కొనసాగించాలన్న వ్యూహ రచన జరుగుతోందనీ, అందుకే ముందుగా ఇలాంటి సర్వేల ద్వారా శివరాజ్ సింగ్ ను ప్రొజెక్ట్ చేస్తున్నారనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో భాజపా శ్రేణులు ఇకపై సీఎం అభ్యర్థి కేంద్రంగానే ప్రచారం చేపడుతుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం… మోడీ పేరుతో ప్రచారానికి దిగితే సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్న వాస్తవాన్ని భాజపా తెలుసుకుందనేది..! మోడీ ఫొటోతో జనాల్లోకి వెళ్తే… పెట్రో ధరలు, నోట్ల రద్దు, జీఎస్టీ ఇలాంటి ఘోర వైఫల్యాలే ఫోకస్ అవుతున్నాయనేది వాస్తవం. సో… గత ఎన్నికల్లో ఏ మోడీ పేరు అయితే భాజపాకి బ్రాండ్ అయిందో.. ఇప్పుడు అదే మైనస్ గా మారబోతోందనడానికి ఇది తొలి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.