భాజపాలో పరిపూర్ణానంద చేరడం ఖాయమనీ, తెలంగాణలో ఆయన్ని ప్రచారానికి దించాలని భాజపా అధిష్టానం భావిస్తోందనీ, ఆయన్ని ఎంపీగా బరిలోకి దించాలనే ఉద్దేశం ఉందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భాజపా అధ్యక్షుడు అమిత్ షాలో పరిపూర్ణానంద భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ తరువాత, మీడియాతో మాట్లాడిన స్వామీజీ… అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు. అమిత్ షాతో భేటీ కంటే ముందే భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో కూడా పరిపూర్ణానంద కాసేపు చర్చించారు.
అమిత్ షాతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడుతూ… ఆధ్యాత్మికం, సామాజికం, రాజకీయం వేరు కాదన్నారు! ‘భవిష్యత్తు కార్యాచరణపై వారు అడగడం జరిగింది. వారితో కొన్ని విషయాలు చర్చించిన తరువాత… ఏరకంగా వారు నిర్ణయిస్తారో, ఏరకంగా వారి అభిప్రాయం వ్యక్తపరుస్తారో, దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో కార్యక్రమాలు ఉంటాయి’ అన్నారు స్వామీజీ. రాబోయే ఎన్నికల్లో భాజపా తరఫున ప్రచారం చేయడానికి మీరు ఆసక్తిగా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ… ‘ఆసక్తి అనేటటువంటిది వారి యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. వారి నిర్ణయం, వారి అభిప్రాయం, వారేం టేకప్ చేయాలనుకుంటున్నారు, వారి విధి విధానాల ప్రకారం ఉంటుంది. నా ఆసక్తి అనేది ఇక్కడ ప్రధానం కాదు’ అన్నారు పరిపూర్ణానంద.
ఈ మాటల తాత్పర్యం ఒక్క వాక్యంలో చెప్పాలంటే… భాజపాను తన అధిష్టానంగా పరిపూర్ణానంద అప్రకటితంగా అంగీకరించారు అనొచ్చు! అందుకే, తన కార్యాచరణ అంతా ఇకపై అమిత్ షా చేతుల్లో ఉందన్నారు. తన ఆసక్తి కన్నా.. వారి అభిప్రాయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయని అనడంలోనే స్వామీజీ అంతరంగం అర్థమౌతోంది. ఏదేమైనా, పరిపూర్ణానంద స్వామికి అప్పుడే రాజకీయ భాష వచ్చేసింది అనిపిస్తోంది. అయినా, తనకు ఆసక్తి లేకుండా ఢిల్లీ వరకూ ఎందుకు వెళ్తారు..? కొద్దోగొప్పో ఆ శక్తి లేదని భాజపా అధినాయకత్వం అనుకుంటే… ఢిల్లీ వరకూ ఈయన్ని ఎందుకు పిలుస్తారు..? యూపీ తరహాలో దక్షిణాదిన కూడా కొంతమంది స్వామీజీలను రంగంలోకి దించాలనేది భాజపా వ్యూహం. దానికి తగ్గట్టుగానే పరిపూర్ణానంద రాజకీయ ప్రవేశం ఉంటుందనే ఊహాగానాలున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడీ భేటీ జరిగింది. విచిత్రం ఏంటంటే… సర్వసంఘ పరిత్యాగులమని సన్యాసం పుచ్చుకున్న స్వామీజీలు, సంఘం కోసం రాజకీయాల్లోకి తీసుకు వస్తున్న ట్రెండ్ ని భాజపా బాగానే ప్రోత్సహిస్తోంది!