ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఇప్పటి వరకూ ఓట్ల పరంగా.. పరిస్థితి ఎలా ఉంటుందన్న టెన్షన్‌కు తోడు అసమ్మతి జ్వాలలా అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది ఎంతగా ఉందంటే.. చివరికి బహిరంగసభను కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లా వైరా టిఆర్ఎస్ అభ్యర్ధిగా బాణోతు మదన్ లాల్ ను ప్రకటించారు. ఈయన గత ఎన్నికల్లో వైసీపీ తరపు నుంచి ఎన్నికై.. టీఆర్ఎస్లో చేరారు. అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. వైరాలో మదన్ లాల్ కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
2014 ఎన్నికలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఎన్నికల బరిలో నిలచి వైసిపి అభ్యర్ధిగా పోటి చేసి గెలుపొందారు. ఆ తరువాత శ్రీనివాసరావుతో విభేదించారు. శ్రీనివాసరెడ్డి వర్గం, మదన్ లాల్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి. ఆతరువాత మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలోఇద్దరూ టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. అయినా వీరి మధ్య సయోధ్య లేదు. అందుకే పొంగులేని శ్రీనివాసరెడ్డి.. మదన్ లాల్ కు సీటు ఇవ్వ వద్దని … ఇస్తే ఓడిస్తామని బహిరంగంగా అధిష్టానానికి హెచ్చరిక పంపారు. అయినా కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇవ్వాలనుకున్నారు కాబట్టి.. ఇచ్చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరిగింది. అలా ప్రచారం జరగగానే ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. దాంతో ఆయన సైలెంట్ అయిపోయారు.
అయితే శ్రీనివాసరెడ్డి వర్గీయులు మాత్రం.. మదన్ లాల్ కు సీటు కేటాయించే విషయాన్ని మరో సారి పరిశీలన లోకి తీసుకుకోవాలని మదన్ లాల్ కు సీటు ఇవ్వవద్దని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చివరికి సోమవారం కూడా.. ఓ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలో అసమ్మతికి తోడు .. ఏ పనీ చేయలేదని ప్రజలూ మదన్‌లాల్‌ను నిలదీస్తున్నారు. ప్రచారానికి వెళ్లిన మదన్ లాల్ ను రేలకాయపల్లి, చీమలపాడు గ్రామాల ప్రజలు, రైతులు మదన్ లాల్ ను నిలదీశారు. ఎమ్మెల్యేగా మాకు ఏం చేశారో చెప్పండంటూ అడ్డుకున్నారు. మదన్ లాల్ ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్దితి. అసమ్మతి గండం మదన్ లాల్ ను అడుగడుగునా వెంటాడుతోంది. ఎక్కడైనా అభ్యర్ధులు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పధకాలు చెప్పుకుంటూ వాటిపై పాటలు తయారు చేయించుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. కానీ వైరాలో మాత్రం అసమ్మతి నేతలు మదన్ లాల్ కు వ్యతిరేకంగా పాటలు తయారు చేయించి ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరిని ఎలా సర్దుబాటు చేయాలో… టీఆర్ఎస్ హైకమాండ్‌కు అర్థం కావడం లేదు.