ఆధ్యాత్మికం, రాజకీయం వేర్వేరు కాదని.. శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద చెబుతున్నారు. ఆయన క్రమంగా రాజకీయాల దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయిన పరిపూర్ణానంద.. బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకు తన ప్రచారం ఉంటుందని ప్రకటించారు. అమిత్ షా ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాల మేరకు ప్రచారం ఉంటుంది. నవరాత్రులు అయిపోయాక దీనిపై పూర్తిగా చర్చిస్తామని ప్రకటించారు .అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తోనూ పరిపూర్ణానందన భేటీ అయి చర్చించారు.
తనపై నగర బహిష్కరణ అంశాన్ని హిందూ సెంటిమెంట్‌కు అనుకూలంగా పరిపూర్ణానంద మలుచుకున్నారు. బీజేపీ తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తే.. హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్తరహాలో తెలంగాణలో స్వామి పరిపూర్ణానంద ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో పరిపూర్ణానంద కూడా ఉత్సాహం గా ఉన్నారు. పరిపూర్ణానంద చెప్పిన దాని ప్రకారం.. అధ్యాత్మిక వేత్తలందరూ రాజకీయ నేతలే. మరి రాజకీయ నేతలందరూ ఆధ్యాత్మక వేత్తలు అవుతారో కాదో మరి..!
నిజానికి ఈ పరిపూర్ణానంద.. చాలా పకడ్బందీగానే రాజకీయ జీవితాన్ని మలుచుకుంటూ వస్తున్నారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. భారత్ టుడే అనే టీవీ చానల్ ను ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా… రాజకీయ కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు. తెలంగాణలో కొన్ని చోట్ల సభలు పెట్టారు. అచ్చం యోగిఆదిత్యనాథ్ లాగే.. వివాదాస్పద ప్రకటనలు చేస్తూ… హైలెట్ కావాలని ప్రయత్నించారు. ఇప్పుడాయన… ప్రయత్నాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఆయన సీఎం అభ్యర్థి అవుతారా..? ఎంపీ అభ్యర్థి అవుతారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే..!