ఛోటా మోటా తెలుగు నటుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయ్! ఎక్కడో స్విచ్ నొక్కితే ఇక్కడ బల్బ్ వెలిగినట్టు… ముంబయ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైన ‘మీటూ’ మనోళ్లు కొందరు కంగారు పడుతున్నారు. హిందీ నటుల్లో మంచి మనిషిగా పేరొందిన నానా పాటేకర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. వచ్చాయి. అక్కడ మొదలు.. దర్శకుడు వికాస్ బెహల్, నటుడు రజత్ కపూర్, రచయిత చేతన్ భగత్ తదితరులపై వచ్చాయి. ‘మీటూ’ మూమెంట్ మీడియాలోనూ మొదలైంది. తాము చేసింది తప్పే… క్షమించమని కొందరు మీడియా ముందుకొచ్చారు. మరికొందరు తమ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్నారని, ఆరోపణల్లో వాస్తవాలు లేవని కేసులు వేశారు. రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తుండటంతో కొందరు ఛోటా మోటా తెలుగు నటుల్లో భయాలు మొదలయ్యాయి. ఎప్పుడు ఎక్కడ తమ పేరు బయటకొస్తుందోనని! తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో ఎర వేసిన జల్సారాయుళ్లు, సహచర మహిళా ఆర్టిస్టులతో అసభ్యంగా ప్రవర్తించినవాళ్లు కొందరున్నారు. వాళ్లకు భయం పట్టుకుంది. ఈ భయాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారని, తెరవెనుక సెటిల్మెంట్లు జరుగుతున్నాయని టాక్. నిజానికి, తెలుగులో ‘మీటూ’ మూమెంట్ మొదలైనట్టే మొదలై మరుగున పడింది. సంచలన ఆరోపణలతో శ్రీరెడ్డి కొన్ని రోజులు హల్చల్ చేశారు. సంబంధం లేని వ్యక్తులను వివాదంలోకి లాగడంతో పాటు ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలను చూపలేకపోవడం వంటి వ్యవహారాలతో శ్రీరెడ్డి అసలు విషయాన్ని పక్కదారి పట్టించారు. ప్రస్తుతం ముంబయ్ ఇండస్ట్రీలో మొదలైన ‘మీటూ’ తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి అగ్గి రాజేస్తుందో చూడాలి!