అరవింద సమేత విడుదలకు సిద్ధమైంది. ఎన్టీఆర్ ని వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఫ్యాన్స్ అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టికెట్ బుక్కింగులు, ప్రీమియర్ షోల హడావుడీ మొదలైపోయింది. `అరవింద` సెన్సార్ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రేమిటన్నది చూచాయిగా బయటకు వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్ బాడీగార్డ్‌గా కనిపించబోతున్నాడట. అదీ… పూజా హెగ్డేకి. ఓ ప్రమాదం నుంచి కథానాయికని హీరో కాపాడడం.. ఆమె ఎన్టీఆర్‌ని తనతో పాటు రాయలసీమ తీసుకెళ్లడం… ఎన్టీఆర్ ధైర్యానికి మెచ్చి కథానాయిక ఇంట్లోవాళ్లు బాడీగార్డ్‌గా ఉండమనడం… `అరవింద` ప్రారంభ సన్నివేశాలు.
చాలా కాలం తరవాత సునీల్ ఈ సినిమాలో హాస్య నటుడిగా కనిపించబోతున్నాడు. ఇందులో సునీల్ పాత్రేమిటన్నదీ తెలిసిపోయింది. సునీల్ ఓ గ్యారేజీ నడుపుకుంటుండాడని, అదే గ్యారేజీలో ఎన్టీఆర్ కూడా చేరి.. సునీల్‌కి చేదోడు వాదోడుగా ఉంటాడని, ఎన్టీఆర్ ఇచ్చిన సలహాల వల్లే గ్యారేజ్‌ని పైకి తీసుకొస్తాడని తెలుస్తోంది. సునీల్ పాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ ఉంటుందని, అతడులో సునీల్ పోషించిన పాత్రకూ ఈ నీలాంబరి పాత్రకూ దగ్గర పోలికలు ఉన్నాయని సమాచారం.