” మేమిద్దరం అన్నదమ్మళ్ల లెక్క… కలసి పెరిగినం” అని మీడియా ముందూ పళ్లు కనిపించేలా.. ఫోజులు ఇచ్చి మరీ ప్రకటనలు చేసినా.. ఇద్దరి మధ్య కనిపించని రేస్ నడుస్తోంది. కేసీఆర్‌కు.. కేటీఆర్‌కు అవసరం ఉంటే తప్ప.. ప్రగతి భవన్‌లోకి హరీష్‌రావు ఎంట్రీ రావడం లేదు. తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. అయినా… హరీష్ రావు.. తన నిజాయితీని.. బయటపెట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త గా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. హరీష్ ఏం చేస్తే.. దాని కన్నా తాను ఎక్కువ చేయగలనంటూ కౌంటర్ ఇస్తున్నారు.
హరీష్‌రావు నిన్న… టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి.. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి రాసినట్లుగా.. ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులో మొత్తం.. చంద్రబాబునే టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడితో పొత్తు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాలని లేఖలో ప్రధానంగా ప్రస్తావించినట్లు ఆయన చెప్పుకున్నారు. కొన్ని పరుషమైన పదాలు కూడా లేఖలో ఉన్నాయి. విభజన సమస్యలన్నింటినీ అందులో లేఖలో పొందుపరిచారు. ఎలాగూ.. ఈ లేఖకు.. టీఆర్ఎస్ అధికారిక మీడియాలో పెద్దగా ప్రచారం రాలేదు. అయితే ఇతర మీడియాల్లో హైలెట్ అయింది. దీంతో తానేం తక్కువ తిన్నాను.. అనుకున్నారేమోకానీ.. సాయంత్రానికి ట్విట్టర్లో కేటీఆర్ చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంపై ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఇటలీ మాఫియా రాజ్యం అన్నవాళ్లు ఇప్పుడు స్నేహితులయ్యారని విమర్శించారు. అందుకే తాను మహా కూటమిని తాను మహా ఘటియాబంధన్ అంటున్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ కాంగ్రెస్‌లతో ఎందుకు పొత్తు పెట్టుకున్నామో కూడా చెప్పుకొచ్చారు.
ఉదయం హరీష్ రావు లేఖ.. సాయంత్రం.. ట్విట్టర్లో.. కేటీఆర్ రెస్పాన్స్ చూస్తే.. హరీష్‌రావును డామినేట్ చేసేందుకు కేటీఆర్ తెగ ప్రయత్నిస్తున్నారన్న విషయం మాత్రం స్పష్టమవుతందన్న అభిప్రాయాలు టీఆర్ఎస్లోనే వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే కల్వకుంట్ల కుటుంబం అధీనంలో ఉన్న హరీష్ రావుకు ఎలాగూ సొంత మీడియాలో ప్రచారం రాదు…. అయినా కేటీఆర్ మాత్రం వదిలి పెట్టడం లేదు. చంద్రబాబును టార్గెట్ చేసుకుని.. ఇద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.