ఎన్నికలలో గెలవడానికి ప్రతి పార్టీ కూడా రకరకాల అస్త్ర-శస్త్రాలు సిద్ధం చేసుకుంటూ నే ఉంటుంది. ప్రత్యేకించి ప్రత్యర్థి పార్టీల వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టేలా ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి అస్త్రాలను సిద్ధం చేయడంలో, ప్రయోగించడంలో చాలా అనుభవజ్ఞుడని అందరూ అంటూ ఉంటారు. అయితే ఈసారి తనకు తెలియకుండానే ఆయన పొరపాటు చేస్తున్నాడా అన్న అభిప్రాయం విశ్లేషకుల లో వ్యక్తమవుతోంది.
2014 ఎన్నికలకు ముందు, వైఎస్ఆర్సీపీ ని టార్గెట్ గా చేసుకుని, పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అంటూ అప్పటికి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న కాంగ్రెస్ పార్టీ కి వైఎస్సార్ సీపీ ని జత చేస్తూ ఆరోపణలు చేయడం ద్వారా వైయస్ఆర్సిపి పార్టీని ఆ పార్టీ అధినేత జగన్ ని చంద్రబాబు బాగానే ఇరుకున పెట్టారు. ఆరోపణలు ప్రజలు నమ్మేలా చేయడంలో కూడా చంద్రబాబు సఫలీకృతులు అయ్యారు. 2014లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ ప్రజల లో ఉందో, అలాంటి వ్యతిరేకతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల లో మోడీ మీద, బిజెపి మీద కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వక పోవడంతో పాటు పలు హామీలను తుంగలో తొక్కడం ఇందుకు కారణం. దీన్ని పసిగట్టిన చంద్రబాబు, తెలివిగా జగన్ ని , పవన్ కళ్యాణ్ ని, మోడీతో కుమ్మక్కయ్యారు అంటూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యూహం కారణంగా, జగన్ పార్టీని కానీ పవన్ కళ్యాణ్ పార్టీని కానీ నేరుగా తిట్టకుండానే వాళ్ళ మీద కి ప్రజల వ్యతిరేకత వచ్చే ఎలా చేయగలిగాడు చంద్రబాబు.పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ నేరుగా అటాక్ చేయడం కంటే కూడా ఇది ఎక్కువగా ఫలితాన్నిస్తోంది.
అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే ముందే తెలంగాణ లో ఎన్నికలు వచ్చాయి. కెసిఆర్ ని ఉద్దేశించి మోడీ తో కుమ్మక్కు అయ్యాడు అని బలంగా ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కేసీఆర్, “నిన్న మొన్నటిదాకా మోడీ సంక లో కూర్చుని నువ్వు కాదా” అంటూ తీవ్ర పదజాలంతో చంద్ర బాబు మీద విరుచుకుపడుతూ ఈ విమర్శలను తిప్పి కొట్టాడు.
చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారా లేక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడాన్ని సమర్థించుకునే ఉద్దేశ్యంతో ఈ వాదనను తెరమీదకు తెచ్చారా అన్నది తెలీదు కానీ ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. మొదటిది, వాస్తవంగా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలలో మోడీ మీద బిజెపి మీద ఉన్నంత వ్యతిరేకత తెలంగాణ ప్రజలలో లేదు. దాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం కూడా లేదు. రెండవది, ఒకవేళ కేసీఆర్ ఎన్నికలలో గెలిచినట్లయితే, ” మోడీ తో కుమ్మక్కు అయ్యాడు” అనే ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదు అనే వాదనను ఆంధ్రప్రదేశ్లో ఇటు జగన్ అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, వారిని సమర్థించే విశ్లేషకులు తెరమీదకు తెచ్చే అవకాశం ఉంది. దీనివల్ల, అయితే ప్రధాన అస్త్రం అని చంద్రబాబు భావిస్తూ ఉన్నాడో, ఆ అస్త్రమే మీరు గారు పోయే అవకాశం ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ప్రస్తుతానికైతే పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప, తెలంగాణ ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిచినా, తక్కువ సీట్లు గెలిచినా తెలుగుదేశం పార్టీకి వచ్చేది కానీ పోయేది కానీ ఏమీ ఉండదు. కానీ దాని ప్రభావం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో, “మోడీ తో కుమ్మక్కు” అస్త్రాన్ని బాబు ముందే వాడేయడం కూడా, జగన్ పవన్ కళ్యాణ్ ల కి కలిసి వచ్చేదే.