ఎన్టీఆర్ సినిమాకి త్రివిక్రమ్ ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే టైటిల్ పెట్టేసరికి అభిమానులంతా షాక్ అయ్యారు. మరీ ఇంత క్లాస్ టచ్‌తో ఉందేంటి?? అని కంగారు పడ్డారు. అయితే క్రమంగా టైటిల్ జనాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ టైటిల్ అభిమానుల గుండెల్లో నాటుకుపోయింది. అసలు ఈ టైటిల్ ఎలా పుట్టింది? దాని వెనుక ఎలాంటి కసరత్తు చేశారు? అనే విషయాన్ని త్రివిక్రమ్ బయటపెట్టాడు.
నిజానికి ఈ సినిమా కోసం `అరవింద` అనే టైటిల్ మాత్రమే అనుకున్నారట. ఈ టైటిల్ ఎన్టీఆర్‌కీ నచ్చింది. అయితే.. రెండ్రోజుల తరవాత ఎందుకో ఈ టైటిల్ అంత పరిపూర్ణంగా లేదనిపించి.. మళ్లీ ఆలోచించడం మొదలెట్టార్ట. అప్పుడే `సీతా సమేత శ్రీరాములు వారు వస్తున్నారు` అనే మాటలు గుర్తొచ్చి… `అరవింద సమేత వీర రాఘవ` అని పెట్టాలని డిసైడ్ అయ్యార్ట. ”లక్ష్మీ నరసింహుడి ఉగ్ర రూపం ఆపడానికి లక్ష్మీదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. లక్ష్మీ దేవిని చూసి నరసిహస్వామి కాస్త శాంత పడ్డారు. శత్రు సంహారానికి దిగిన వీర రాఘవుడ్ని కాస్త అదుపులో పెట్టడానికి అరవింద ప్రయత్నిస్తుంది. అందుకే అరవింద సమేత వీర రాఘవ అనే పేరు పెట్టాం” అని క్లారిటీ ఇచ్చాడు త్రివిక్రమ్.