“మీ టూ” ఉద్యమం వైరస్‌లా పాకిపోతోంది. బాలీవుడ్ హీరోయిన్ తనూశ్రీ దత్తా ఏ ఉద్దేశంతో… ఎప్పుడో పదేళ్ల కిందట షూటింగ్ లో జరిగిన విషాయాన్ని లైంగిక వేధింపుల పేరిట ఇప్పుడు బయటపెట్టి.. “మీ టూ”కి కొత్త మలుపు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈ “మీ టూ” హాలీవుడ్ లో ప్రాచుర్యం పొందింది. నిర్మాతగా ఉన్న హార్వే వీన్‌స్టన్… పూర్తిగా వృద్ధుడైపోయిన తర్వాత.. నిర్మాతగా యాక్టివ్ గా లేకపోవడంతో.. ఇక ఏమీ చేయలేడన్న ఉద్దేశమో .. ఏ చాన్సులు ఇవ్వలేరన్న కారణమో కానీ.. ఆయనతో పని చేసిన వారందరూ.. దాదాపుగా ఆరోపణలు చేశారు. లెక్కకు మిక్కిలిగా బయటకు వచ్చారు. ఈ ఆరోపణలపై ప్రత్యేకంగా విచారణ జరిపి.. ఆయనకు శిక్ష విధించాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వచ్చిన వార్తలు, విశ్లేషణలు.. పనిలో పనిగా కొన్ని స్వయం ప్రకటిత పత్రిక తీర్పులు ఆయనకు శిక్ష విధించేశాయి. గొప్ప నిర్మాతగా బతికినా ఆయన జీవితంపై లైంగిక వేధింపుల కీచకుడిగా ముద్రపడిపోయింది. ఆ హాలీవుడ్ “మీ టూ” ఉద్యమాన్ని ఇండియాలో కూడా వైరల్ చేద్దామని ఆ మధ్య కొంత మంది హడావుడి చేశారు కానీ.. పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ అమెరికా పౌరసత్వం ఉన్న తనుశ్రీదత్తా ఇండియా కు వచ్చి.. నానా పటేకర్ పై “మీ టూ” పేరుతో ఆరోపణలు చేయడంతో.. వ్యవహారం రచ్చకెక్కింది.
నిజానికి తనూశ్రీ దత్తాకి… మొదట్లో బాలీవుడ్ లోనూ పెద్దగా మద్దతు లభించలేదు. కానీ రాను రాను.. మద్దతు పెరిగింది. అంతే కాదు..”మీ టూ” పేరతో…తమకు ఎదురైన లైంగిక వేధింపులను… ఒక్కొక్కరు బయటపెట్టడం ప్రారంభించారు. అందరూ సెలబ్రిటీలే. ప్రముఖ వ్యక్తులపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలే. సపోజ్.. సామాన్యులు.. తమ సమాన సామాన్యులపై .. ఇలాంటి ఆరోపణలు చేస్తే.. పట్టించుకునే మీడియా ఉండదు. అందుకే సెలబ్రిటీల కోసమే ఈ “మీ టూ”ఉద్యమం. కేంద్రమంత్రి ఎంజె అక్బర్ నుంచి… తమిళ దిగ్గజ రచయిత వైరముత్తు వరకు.. అనేక మందిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “మీ టూ” పేరుతో సోషల్ మీడియాలో తమకు ఎదురైన లైంగిక వేదింపుల ఆరోపణలను…బహిర్గతం చేస్తున్నారు. సినిమా వాళ్లకు సంబంధించినదైతే మీడియాకు ఓ మసాలా న్యూస్. ఇక రాజకీయాలకు సంబంధించిన వారైతే మసాలా కమ్.. సీరియస్ న్యూస్. అసలే ఎన్నికల కాలం… ఇంకేం ఇలాంటి ఆరోపణలను రాజకీయంగా వాడుకోవడం చాలా సులభం. ప్రసిద్ద జర్నలిస్ట్ అయిన ఎంజె అక్బర్ ప్రస్తుతం విదేశాంగ సహాయమంత్రిగా ఉన్నారు.. ఆయనపై పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఇదే పొలిటికల్ హీట్ సబ్జెక్ట్.
“మీ టూ” పేరుతో ఇప్పుడు ప్రముఖ మహిళలు.. మేల్ ప్రముఖులపై చేస్తున్న ఆరోపణలు ఏవీ ఇప్పటివి కావు. పదేళ్లు.. ఇరవై ఏళ్ల కిందటివి కూడా. అలోక్ నాథ్ అనే సీనియర్ బాలీవుడ్ నటుడిపై ఓ మహిళా రచయితే.. ఇరవై ఏళ్ల కింద అత్యాచారం చేశారు..”మీ టూ” ఖాతాలోనే ఆరోపణలు చేశారు. నిజానికి ఇలా చేసే ఆరోపణలు కేసులు, కోర్టులు, శిక్షల వరకూ వెళ్లవు. కానీ… మీడియాలో జరిగే ప్రచారంమే వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి శిక్ష. ఆరోపించేవారికీ కావాల్సింది అదే. తాము చేస్తున్న ఆరోపణలు నిరూపించలేమని వారికీ తెలుసు. అందుకే.. ఈ “మీ టూ” ఉద్యమం ఓ వైరస్ లా పాకిపోతోంది. అది సినిమా రంగం నుంచి రాజకీయానికి వచ్చింది… అక్కడ్నుంచి.. వ్యాపార, క్రీడా, మీడియా రంగాలకు పాకినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. … #MeToo