తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ఓపక్క రాష్ట్రంలో భాజపా జాతీయ అధ్యక్షుడు పర్యటిస్తుంటే, ఇదే రోజున మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలంతా ఒకే హెలీకాప్టర్ లో వెళ్లి, ర్యాలీలో పాల్గొన్నారు. మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో విజయశాంతి, డీకే అరుణ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు మొదలుపెట్టింది. వీళ్లకి బాధ్యతలు అప్పగించడంతో… మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ సభలకీ ర్యాలీలకీ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా జోష్ గానే ఉంది.
సభల విషయంలో సంతృప్తి వ్యక్తమౌతున్నా… ఇదేదో అభ్యర్థుల ప్రకటన తరువాత సాగే ప్రచారంగా ఉంటే బాగుండేదనే అభిప్రాయం అదే పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతున్నట్టు సమాచారం! ముందస్తు ఎన్నికలు అనుకోగానే… తెరాస వందకుపైగా అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. ఆ తరువాత, కేసీఆర్ వరుస సభలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీ కూడా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలని అనుకున్నా… మహా కూటమి తెరమీదికి రావడంతో.. ఆ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేట్టుగానే కనిపిస్తోంది. కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలీక్కి రావాల్సి ఉంది. అంతేకాదు, సొంతంగా కాంగ్రెస్ పోటీ చేస్తామనుకుంటున్న స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఇంకా కసరత్తే జరుగుతోంది.
అభ్యర్థుల జాబితా ప్రకటించేలోగా… ప్రచార పర్వంలో సగం కాలం గడిచిపోతే ఎలా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇంకోటి, రాష్ట్ర నేతలు, స్టార్ కేంపెయినర్లు వరుసగా సభలు నిర్వహించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసేస్తున్నా… స్థానికంగా ఆయా సభల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు తీసుకోవాలనే చర్చ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే, బస్సు యాత్రలకు చాలా ఖర్చు చేశామనీ… తమకు టిక్కెట్ ఇస్తారో పొత్తులో పోతుందో అనే స్పష్టత లేకుండా ప్రచారానికి ఎలా సమాయత్తం కాగలమనే అభిప్రాయమూ కొంతమంది ఆశావహుల నుంచి వ్యక్తమౌతోంది! ప్రచారపరంగా చూసుకుంటే.. తెరాసకు ధీటుగానే కాంగ్రెస్ కూడా హడావుడి చేస్తున్నట్టు కనిపిస్తున్నా, అభ్యర్థుల ప్రకటన వీలైనంత త్వరగా జరగాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఈ ఒక్క విషయంలోనే కాంగ్రెస్ ప్రచారం కంటే, తెరాస ప్రచారం కొంత స్పష్టంగా ఉంటోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.