ఓపక్క సీట్ల సర్దుబాట్లపై కాంగ్రెస్ లో తీవ్ర చర్చోపచర్చలు జరుగుతుంటే… గాంధీ భవన్ కి ఆశావహుల తాకిడితోపాటు, ఫిర్యాదుల వెల్లువ ఎక్కువైందని తెలుస్తోంది..! తమకే టిక్కెట్లు కావాలంటూ ప్రయత్నాలు చేసేవారు కొందరైతే… తాము పోటీకి దిగుదాం అనుకుంటున్న స్థానాల్లోకి ఎంపీ అభ్యర్థులు వచ్చి పోటీ చేస్తా అంటూ కొత్త ఫిర్యాదులు కూడా గాంధీభవన్ కు చేరుతున్నట్టు తెలుస్తోంది..!
తెలంగాణలో గడువు ప్రకారం ఎన్నికలు జరిగితే అసెంబ్లీతోపాటు లోక్ సభకు కూడా ఎన్నికలు వచ్చేవి. కానీ, అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసేయడంతో కొన్ని నెలలు ముందుగానే ఎన్నికలు తప్పలేదు. అయితే, రాష్ట్రంలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్ సభ అభ్యర్థులుగా బరిలోకి దిగాలనుకున్న కొంతమంది.. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీకి దిగేందుకు సిద్ధమౌతూ ఉండటం విశేషం..! బలరామ్ నాయక్ ఇదే ప్రయత్నంలో ఉన్నారు. సీనియర్ నేత మధు యాష్కీ కూడా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి, అసెంబ్లీకి వెళ్లాలనే అనుకుంటున్నారు! పొన్నం ప్రభాకర్ కూడా ఎమ్మెల్యేగా గెలవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టు సమాచారం. వీరితోపాటు, 2019లో కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీకి దిగుదామనుకున్న మరికొందరు ఆశావహులు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ల రేసులో ఉన్నట్టు తెలుస్తోంది!
ఎమ్మెల్యే టిక్కెట్ గ్యారంటీ అనుకున్న కొందరు అభ్యర్థుల్ని పక్కనపెట్టి… సీనియర్ నేతలకు టిక్కెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సహజంగానే అసంతృప్తులు ఉంటాయి. అలాంటి కొంతమంది నేతలు ఇప్పుడు గాంధీభవన్ కు ఫిర్యాదులతో వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో గెలుపే ముఖ్యం కాబట్టి… ఎప్పుడో జరగబోయే లోక్ సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని… గెలిచే అవకాశం గ్యారంటీగా ఉన్న సీనియర్లను ఖాళీగా ఉంచడం ఎందుకూ, ఇప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేస్తే మంచిదే అనే ఉద్దేశంతో హైకమాండ్ కూడా ఉన్నట్టు గాంధీభవన్ లాబీల్లో కొందరు నేతలు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంపీలు ఎన్నికలు వస్తాయి కాబట్టి, అప్పుడు మరింత సులువుగా లోక్ సభ స్థానాలను గెలిపించుకోవచ్చనే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది! కాబట్టి, ఎంపీ అభ్యర్థులు అనుకున్నవారిని కూడా ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు ఇచ్చేద్దామనేది పార్టీ నిర్ణయంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో అసంతృప్తులు వ్యక్తమైనా… కఠినంగా వ్యవహరించే ఉద్దేశంతోనే పీసీసీ ఉందనీ సమాచారం!