అనంతపురం జిల్లాలో బైరవాని తిప్ప ప్రాజెక్టు పునరుజ్జీవన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ… మనకు నాయకులు సృష్టించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయనీ, అదే కేంద్ర ప్రభుత్వమనీ విమర్శించారు. తెలంగాణలో తెరాస ఉపయోగించుకుంటోందనీ, ఇక్కడ వైకాపాని వినియోగించుకుని, పవన్ కల్యాణ్ ను కూడా వాడుకుంటూ మన మీద దాడి చేస్తోందన్నారు. ఈ ముగ్గురి సాయంతోనే టీడీపీని లక్ష్యంగా చేసుకుందన్నారు. అయినా ఫర్వాలేదనీ, ప్రజల అండతో కొండను ఢీ కొనే శక్తి టీడీపీకి ఉందన్నారు.
ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడన్న ఉద్దేశంతో తాత్కాలికంగా సంక్షేమ పథకాలిచ్చామనీ, దీర్ఘకాలంలో సంపద సృష్టించడానికి పరిశ్రమలు, వ్యవసాయానికి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాజకీయాల్లో ఐదేళ్లకి ఓసారి ఎన్నికల్లో పాస్ కావాలనీ, మళ్లీ పాసైనేతే అన్ని పనులూ సక్రమంగా పూర్తి అవుతాయని చంద్రబాబు చెప్పడం గమనార్హం! ‘ఇంకొకరు ఏదో ఇస్తారంట, అని ఏమారితే చాలా ఇబ్బందుల్లో పడతారు. నాక్కాదు, మొత్తం సమాజానికే ఇబ్బంది వస్తుంది. రాష్ట్రానికే ఇబ్బందులు వస్తాయి’ అని చంద్రబాబు చెప్పడం విశేషం! ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతోందనీ, జవాబుదారీతనం తీసుకొచ్చామనీ, ఇలాంటి సందర్భంలో ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. ప్రభుత్వ పనితీరుపై ఈ నెలలో 80 శాతం ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమైందని చంద్రబాబు చెప్పారు. ఎవరో ఎక్కడో తప్పుచేస్తే, అది మొత్తం ప్రభుత్వం చేసినట్టు ఆలోచిస్తే మంచిది కాదన్నారు! వ్యవస్థలో అక్కడక్కడా ఒకట్రెండు తప్పులుంటాయనీ, కానీ తాను ఎవ్వర్నీ ఉపేక్షించనని ముఖ్యమంత్రి చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు రెండు విషయాలపై స్పష్టంగా మాట్లాడారని చెప్పొచ్చు! మొదటిది, భాజపా డైరెక్షన్లో ఆ ముగ్గురూ పనిచేస్తూ… టీడీపీ మీద విరుచుకుని పడుతున్నారని చెప్పడం! రెండోది, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకుంటూ వస్తున్న చేతికి ఎముకల్లేని హామీలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయడం. ఎవరో ఏదో ఇస్తారని ఏమారితే, తరువాత బాధపడాల్సి ఉంటుందని సీఎం చెప్పడం కచ్చితంగా ఆసక్తికరమైన వ్యాఖ్యే. నిజానికి, ప్రతిపక్ష నేత జగన్ ఇచ్చుకుంటూ వెళ్తున్న హామీలన్నీ సమస్యలకు తాత్కాలిక పరిష్కార మార్గాలే తప్ప.. శాశ్వత విముక్తికి వ్యూహాలుగా కనిపించడం లేదన్నది వాస్తవం. ఇదే పాయింట్ ను టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమౌతోందని సీఎం చంద్రబాబు నాయుడు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.