విజయనగరం జిల్లా గజపతినగరంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా జరిగిన సభలో యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడమే ప్రధాన అజెండాగా ప్రసగించారు! ఇదే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండుగ అన్నారనీ, ఇదే చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలారేసుకోవాలన్నారనీ, ఇదే చంద్రబాబు ప్రాజెక్టులు కట్టడం వల్ల రాబడి ఉండదన్నారనీ, ఇదే చంద్రబాబు నాయుడు సబ్సిడీలు పులిమీద సవారీలు అన్నారని జగన్ చెప్పారు! ఇలాంటి వ్యక్తికి రైతులకు సంబంధించిన అవార్డు ఇస్తున్నారంటే.. అవహేళన చేసినట్టు కాదా అన్నారు జగన్. ఇలాంటి చంద్రబాబు నాయుడుకి పురస్కారాలు ఇస్తున్నారట, అవార్డులు ఇస్తున్నారట… ఇంతటి దారుణమైన పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడుకి ఎలాంటి అవార్డు ఇవ్వాలీ అని అడుగుతా ఉన్నా అన్నారు జగన్.
ఇంతకీ… జగన్ చెప్తున్నదేంటీ, గతంలో సాధ్యం కాదని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వాటిని సుసాధ్యం చేసినందుకు అవార్డులు వస్తున్నాయని పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టా..? లేదంటే, అప్పుడు కాదని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు మాట మార్చేసి.. నాడు కాదన్న పనుల్ని పూర్తి చేయడం సరికాదని జగన్ అభిప్రాయపడుతున్నట్టా..? ఆ పనుల్నీ చేసేశారని అక్కసు వెళ్లగక్కుతున్నారా..? అవార్డులు ఇచ్చేవారిది తప్పా… లేదంటే, తీసుకుంటున్నవారిది తప్పని చెబుతున్నారా..? ఎలా చూసుకున్నా చంద్రబాబు పనులు చేశారనే జగన్ చెప్తున్నట్టా..?
సరే.. ఈ కన్ఫ్యూజన్ కాస్త పక్కనపెడితే… గజపతినగరంలో జగన్ మాట్లాడిన మాటల్లో సగటున ఐదు సెకెన్లకి ఓసారి చొప్పున చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తూ వచ్చింది! జగన్ ప్రసంగం అంటే చంద్రబాబు నాయుడుని విమర్శించడం తప్ప మరొకటి ఉండదనే ఒక స్థాయి నమ్మకం ఇప్పటికే ఉంది. అంటే, టీడీపీ మీద వ్యతిరేకతను మాత్రమే తమ బలంగా జగన్ చూసుకుంటున్నారా..? వైకాపా విధానాలేంటీ, విజన్ ఏంటనేది ప్రజలు చూడరని జగన్ భావిస్తున్నారా..? ఇంకో విషయం… ఒక వ్యక్తిపై పదేపదే విమర్శలు చేస్తూ చేస్తూ ఉంటే, ఆ వ్యక్తిని విమర్శించేవాడిపై ఉన్న అభిమానం కంటే… విమర్శలకు గురౌతున్న వ్యక్తిపై సానుభూతి క్రమంగా పెరుగుతుందనే సామాన్యమైన విషయాన్ని మరచిపోతున్నట్టుగా ఉన్నారు. ఈ విమర్శలే బలమని అనుకుంటున్నా.. బలమైన బలహీనత కూడా అవుతుందేమో అనే విశ్లేషణ చేసుకోవాల్సి ఉందనేది చాలా స్పష్టం.