టీఆర్ఎస్లో రాజకీయ వారసుడిగా చక్రం తిప్పుతున్న కేటీఆర్ అనుంగు అనుచరుడు ఎంపీ సుమన్‌కు చెన్నూరు టిక్కెట్ ఇచ్చారు. ఆయన అక్కడ స్థానికుడు కాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదేలు తీవ్ర నిరసన వ్యక్తం చేసి.. గట్టయ్య అనే కార్యకర్త ఆత్మాహుతి తర్వాత సైలెంటయిపోయారు. కానీ ఇప్పుడు కొత్తగా సుమన్‌కు మరో పోటీ వచ్చి పడింది. టిక్కెట్ తమకే కేటాయించాలంటూ.. “కాకా” వెంకటస్వామి కుమారులు పట్టుబడుతున్నారు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన కుటుంబ రాజకీయ నేపధ్యం ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించుకోలేకపోయారు. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వెంకటస్వామి కొడుకులు వివేక్ , వినోద్లకు టీఆర్ఎస్లో పరిస్థితులు మింగుడు పడటంలేదు. మాజీ మంత్రి వినోద్‌కు చెన్నూరు టిక్కెట్ వస్తుందని.. చాలా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరే టప్పుడు.. ఓదెలు స్థానం లో వినోద్ కు చెన్నూరు అసెంబ్లీ, వివేక్ కు పెద్దపల్లి లోక్ సభ టికెట్ గ్యారెంటీ అని క్యాడర్ లెక్కలు వేసుకుంది. అయితే అనూహ్య పరిణామాలతో పెద్దపల్లి ఎంపిగా కొనసాగుతున్న సుమన్ ను చెన్నూరు అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో అన్ని వనరులు ఉండి కూడా అన్నకు టికెట్ ఇప్పించుకోలేకపోయారన్న ఒత్తిడిని మాజీ ఎంపి వివేక్ ఎదుర్కొంటున్నారు. నెల రోజులుగా నియోజకవర్గం లోని వీరి వర్గం నేతలు అసంతృప్తి తో రగిలిపోతున్నారు.
ఈ నెల 6న తమ తండ్రి వెంకటస్వామి జయంతి వేడుకలకు క్యాడర్ నంతా హైదరాబాద్ కు పిలిపించారు. కేసీఆర్‌ను కలుద్దామనుకున్నారు. కానీ ఆయన సమయం ఇవ్వలేదు. దాంతో కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. చెన్నూరు లో సుమన్ గెలిచే అవకాశాలు లేవని, ఆయన్ను మార్చేసి…. ఆ స్థానంలో వినోద్ కు టికెట్ ఇవ్వాలని కోరారు. వినోద్ గతంలో మంత్రి గా పని చేసినందున ..ప్రజల్లో మంచి పేరు ఉందని, ఇపుడున్న పరిస్థితి లో ఆయనే సరైన అభ్యర్థి అని చెప్పారు. పైగా తన అన్నకు న్యాయం చేయాలని వివేక్ కూడా కోరారు. కానీ కేటీఆర్ తన అనుచరుడ్ని ఎందురు మారుస్తారు..? అభ్యర్థిని మార్చడం కుదరదని చెప్పి ..పెద్దపల్లి టిక్కెట్ వివేక్‌కు ఇచ్చేందుకే.. సుమన్‌ను మార్చామని చెప్పి.. వెళ్లిపోయారు.
దాంతో వివేక్ వర్గీయులు అసహనానికి గురయ్యారు. చెన్నూరు లో సుమన్ తో కలిసి పనిచేయలేమని.. తమ దారి తాము చూసుకుంటామని ప్రకటించారు. వినోద్ ను ఇండిపెండెంట్ గా పోటీ చేయిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన చేశారు. అయితే వినోద్ అలాంటి ప్రయత్నం చేయరని… ఒక వేళ చేసినా తన మద్దతు ఉండబోదని వివేక్ చెప్పేశారు. మరో వైపు ఈ పరిణామాలతో వినోద్ సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అధినేత పై భరోసా తో ఉంటే అన్యాయం జరిగిందని అనుచరులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్నా.. సుమన్ గెలుపు కోసం వారు పని చేసే అవకాశాలు అయితే లేవనేది స్పష్టంగా తెలిసిపోతోంది.