వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి.. చంద్రబాబు మీద మరో సారి కోపం వచ్చింది. విజయనగరం జిల్లాలో ఆయన పాదయాత్రలో .. ప్రసంగం మొత్తం చంద్రబాబునే టార్గెట్ చేసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి మరెవరూలేరని, ఆయనకి చెత్త ముఖ్యమంత్రి అవార్డు ఇస్తే సరిపోతుందని వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. కరువు తాండవిస్తుంటే కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు. ముఖ్యమంత్రికి కలియుగ కుంభకర్ణ బిరుదుతో సత్కరించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు చచ్చుబడిపోయాయని విమర్శించారు. ఇప్పుడు హఠాత్తుగా.. అవార్డులకు ముడిపెట్టి.. జగన్.. చంద్రబాబును ఎందుకు విమర్శించారంటే.. రెండు రోజుల కిందట.. చంద్రబాబుకు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ నేతృత్వంలోని కమిటీ.. ఓ అవార్డు ప్రకటించింది.
11వ గ్లోబల్ అగ్రికల్చరల్ లీడర్షిప్ అవార్డు-2018కి చంద్రబాబుకు ప్రకటించారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన నియమించిన జ్యూరీ కమిటీ ఈ అవార్డును ఎంపిక చేసింది. జాతీయ అవార్డు కమిటీ ఢిల్లీలో గత నెల 15 న సమావేశమై చంద్రబాబును పాలసీ లీడర్షిప్ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగంలో ప్రగతి సాధించి.. పల్లెల సౌభాగ్యానికి కృషి చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విజన్‌తో నాయకత్వం వహించినందుకు ఈ అవార్డు ఇస్తున్నారు. ఈ నెల 24వ తేదీ సాయం త్రం ఢిల్లీలోని హోటల్ హయత్ రీజెన్సీలో నిర్వహిం చే కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. ఈ అవార్డు విషయం హైలెట్ అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోయారు. అవార్డుల విషయంలో.. తన కసి అంతా తీర్చుకున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఏపీలో ఏం జరుగుతున్నా.. అందులో 90 శాతం క్రెడిట్.. పదేళ్ల కిందటే చనిపోయిన తన తండ్రికి ఇవ్వనిదే ముందుకెళ్లరు. పోలవరం కావొచ్చు… హంద్రీ నీవా కావొచ్చు.. చివరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ… తన తండ్రిదే క్రెడిట్ అంటూ ఉంటారు. కానీ చంద్రబాబుకు వస్తున్న అవార్డుల విషయాలను.. తన తండ్రి ఖాతాలో ఎలా వేయాలో అర్థం కాక… వాటిని తక్కువ చసేలా.. విమర్శలు చేసి సంతృప్తి పడుతున్నారు. అంతకు మించి జగన్ చేయగలిగిందేమీ కూడా లేదు. తనకు నోరు నొప్పి పుట్టేంత వరకూ విమర్శించడమే..!