నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం టిక్కెట్ అమరవీరుడు.. కాసోజు శ్రీకాంతాచారి తల్లికి ఇవ్వడం లేదు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి… స్నేహితుడు సైదిరెడ్డికి టిక్కెట్ ఖరారు చేస్తున్నారు.ఈ విషయం తెలిసి… శంకరమ్మ…తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. టికెట్ విషయంలో కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించనని ప్రకటించారు. కానీ టిక్కెట్ ఇవ్వకపోతే మాత్రం.. తెలంగాణ కోసం నా కుమారుడు శ్రీకాంతాచారి ఏం చేసుకున్నాడో… మంత్రి జగదీష్‌రెడ్డి ఇంటి ముందు నేను అదే చేసుకుంటానని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని అంటున్న జగదీష్‌రెడ్డికి ఘాటుగానే రిప్లయ్ ఇస్తున్నారు. సూర్యాపేట టిక్కెట్‌ను తనకు ఇచ్చి వదిలేసి… జగదీశ్ రెడ్డి ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి కావొచ్చు కదా అని సూటిగా ప్రశ్నించారు. హుజూర్గనర్లో పార్టీ కోసం తాను కష్టపడితే… ఇప్పుడు సైదిరెడ్డిని తెరపైకి తేవడం అన్యాయమని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు.
హుజూర్ నగర్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కూడా. ఇక్కడ నుంచి మూడో సారి బరిలోకి దిగబోతున్నారు ఉత్తమ్. గత ఎన్నికల్లో కాసోజు శంకరమ్మపై 24 వేల మెజారిటీ సాధించారు. అయితే ఉత్తమ్‌ను ఓడించాలని కేసీఆర్.. ప్రత్యేకంగా వ్యూహరనచ చేస్తున్నారు. సైదిరెడ్డి అనే ఎన్నారై పేరును జగదీష్ రెడ్డి.. ప్రచారంలోకి తెచ్చారు. అంకిరెడ్డి ఫౌండేషన్ ను స్థాపించి కొన్నాళ్లుగా సైదిరెడ్డి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే… సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించి జరిగిన స్కామ్‌లో సైది రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. తనకు ఎలాంటి అండ లేకపోయినా.. శంకరమ్మ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న కొడుకు తల్లిగా తనను గౌరవించి టికెట్ ఇవ్వాలని శంకరమ్మ, మాతృభూమికి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని సైది రెడ్డి లు అంటున్నారు. వీరిద్దరూ టికెట్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కెసిఆర్ మాత్రం ఉత్తమ్ కు చెక్ పెట్టే దిశగా బలమైన టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి బరిలో దింపుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ హుజూర్‌నగర్‌లో పోటీ చేసే ప్రశ్నే లేదని… గుత్తా చెప్పినట్లు తెలుస్తోంది మొత్తానికి శంకరమ్మ మాత్రం.. వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.