మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్… పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు అయిన నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ పై పడటంతో గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. ఆ తర్వాత.. రాజకీయాల్లో చురుకుగా లేరు. కానీ మళ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తూండటంతో… ఏదో ఓ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనకు ఉన్న రాజకీయ పరిమితుల దృష్ట్యా ఆయనకు… టీడీపీ, వైసీపీల్లో అవకాశం లేకుండా పోయింది. దీంతో జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం.. ఆయన తిరుపతిలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. కుటుంబ కార్యక్రమం కోసం.. పవన్ కల్యాణ్ తిరుపతికి వెళ్తున్నారు. అక్కడే కండువా కప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు.
అందుకే నాదెండ్ల మనోహర్ చాలా రోజుల నుంచి జనసేన పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. దాని కోసం… తనకు పరిచయం ఉన్న .. పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడుగా పేరున్న పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్..సాయం తీసుకున్నారు. లింగమనేని రమష్ రియల్ ఎస్టేట్ వెంచర్లో కొద్ది రోజుల క్రితం నిర్మించిన దశావతార వెంకటేశ్వర ఆలయానికి సంబంధించి విగ్రహ ప్రతిష్టాపన పనుల్లో నాదెండ్ల మనోహర్ కీలకంగా వ్యవహరించారు. గుడి కార్యక్రమం అయిపోయిన తర్వాత లింగమనేని రమేష్… నాదెండ్ల మనోహర్‌ను తీసుకుని పవన్ కల్యాణ్ ను విజయవాడ ఇంటిలో కలిశారు. అప్పుడే పార్టీలో చేరికపై చర్చలు జరిపారు. చివరికి ఇప్పటికి అది మెటీరియలైజ్ అయినట్లు తెలుస్తోంది.
నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన తరపున గుంటూరు జిల్లా వ్యవహారాలు చక్కదిద్దే పని కూడా అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. గుంటూరులో చెప్పుకోదగ్గ నేత లేదని.. జనసేనకు… నాదెండ్ల మనోహర్ చేరిక… కాస్త బలం ఇచ్చేదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.