తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి అనూహ్యంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పద్మినీరెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో పద్మినీరెడ్డి చేరికతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పద్మినీరెడ్డి భర్త దమోదర రాజనర్సింహ ప్రస్తుతం కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పద్మినిరెడ్డి బీజేపీలో చేరారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
దామోదర రాజనర్సింహ సతీమణి.. చాలా రోజులుగా.. కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. గతంలో సంగారెడ్డి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ టిక్కెట్ దక్కలేదు. ఈ సారి అయినా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నించినా… చాన్స్ దక్కలేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌లోని ఇతర ముఖ్య నేతలు… కుటుంబానికి రెండేసి టిక్కెట్లు తీసుకుని.. తమకు మాత్రం.. మొండి చేయి చూపడమేమిటన్న భావన… దామోదర కుటుంబంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఆమె బీజేపీలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. భార్య బీజేపీలో చేరికపై… రాజనర్సింహ స్పందనేమిటనేదానిపై కాంగ్రస్ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఆంథోల్ నియోజకవర్గం నుండి దామోదర రాజనర్సింహ పోటీ చేయబోతున్నారు. అదే సమయంలో.. ఆ నియోజకవర్గం నుంచి… తాజా మాజీగా ఉన్న… బాబూమోహన్… టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. ఇప్పుడు దామోదర రాజననర్సింహ సతీమణి పద్మిని రెడ్డి బీజేపీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నారా లేక… ఏదైనా తెర వెనుక రాజకీయం ఉందా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. పద్మినిరెడ్డి చేరికతో… బీజేపీ నేతల్లో కాస్తంత ఉత్సాహం కనిపిస్తోంది.