తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ చుట్టూ తిరుగుతోంది. పోటీ చేసే ఆ కొన్ని స్థానాల్లో బాలకృష్ణను స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. చంద్రబాబు ఎలాగూ ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు కాబట్టి.. ఆ లోటును బాలకృష్ణతో భర్తీ చేసుకోవాలనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ ప్రచారం చేశారు. మథిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటనకు… ప్రజలు మంచి స్పందన వచ్చింది. దీంతో… బాలకృష్ణ తెలంగాణలో టీడీపీ పోటీ చేసే స్థానాల్లోనూ ప్రచారం చేసేలా ఒప్పించేందుకు టీ టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సారథి స్టూడియోలో బాలకృష్ణతో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. బాలకృష్ణను కలిసిన వారిలో ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. వారందరూ.. తెలంగాణలో మహాకూటమికి ప్రచారం చేయాలని కోరారు. ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ ప్రచారానికి మంచి స్పందన వచ్చిందని.. కృతజ్ఞతగానే బాలకృష్ణను కలిశామని.. టీ టీడీపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో మహాకూటమి తరపున ప్రచారం చేయాలని కోరామన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్లో పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో.. బాలకృష్ణను కలవడం అదృష్టంగా భావిస్తున్నామని.. టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.
టిక్కెట్ల విషయంలోనూ.. చాలా మంది నేతలు.. బాలకృష్ణ సిఫార్సు కోసం వెళ్తున్నారు. పొత్తుల్లో భాగంగా సీటును కేటాయింప చేసుకోవడంతో పాటు.. అక్కడ తమకే టిక్కెట్ దక్కేలా కొంత మంది విస్త్రత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చంద్రబాబును కలవడం కష్టం కావడంతో వారంతా బాలకృష్ణ దగ్గరకు వెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితం… కృష్ణా జిల్లా హంసల దీవిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తెలంగాణ నేతలు అక్కడికి క్యూ కట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ మూవీ షూటింగ్ సారధి స్టూడియోలో జరుగుతోంది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎన్టీఆర్ పార్టీ ప్రకటించే సమయంలో.. పసుపు-కుంకుమ చల్లుతూ పార్టీ పేరు రాసే సీన్ చిత్రీకరిస్తున్నారు.